స్టీల్ ప్లాంట్ టెండర్ డౌట్! బీఆర్ఎస్ పొలిటికల్ స్టంట్ అని ఫైర్

by Disha Web Desk 4 |
స్టీల్ ప్లాంట్ టెండర్ డౌట్! బీఆర్ఎస్ పొలిటికల్ స్టంట్ అని ఫైర్
X

వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్ల ప్రక్రియలో సింగరేణి పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పాల్గొంటే ఒకలా, లేదంటే మరోలా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోక తప్పదు. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండడంతో.. ఇందులో సింగరేణి సంస్థ పాల్గొంటుందా?.. లేక పలు కారణాలను చూపి దూరంగా ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారరింది. పొలిటికల్ అస్త్రంగా మల్చుకోడానికి ఇది గులాబీ పార్టీ వేసిన ఎత్తుగడా? అనే చర్చలూ కొనసాగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మూలధనాన్ని సమకూర్చే టెండర్ ప్రక్రియలో సింగరేణి పాల్గొంటుందా? లేదా? అన్నది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. టెండర్ వేస్తే ఒక రకమైన రియాక్షన్‌ను, వేయకపోతే రాజకీయంగా మరో రకమైన విమర్శలను తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి నడుమ రాష్ట్ర సర్కారు, సింగరేణి సంస్థ తీసుకునే నిర్ణయం భిన్నమైన పరిణామాలకు దారితీయనున్నది.

ప్రతిష్టగా తీసుకుని బిడ్ దాఖలు చేస్తుందా?.. లేక కారణాలను చూపి వెనకడుగు వేస్తుందా? అనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. గడువు ముగిసే సమయానికి సింగరేణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది. టెండర్లు దాఖలు చేయడానికి షెడ్యూలు ప్రకారం గురువారం చివరి రోజు. మరి టెండర్ ప్రక్రియలో సింగరేణి సంస్థ పాల్గొంటుందా?..

లేక పలు కారణాలను చూపి దూరంగా ఉంటుందా?.. లేక పొలిటికల్ అస్త్రంగా మల్చుకోడానికి అధికార పార్టీ వేసిన ఎత్తుగడా? అనే చర్చ రాష్ట్రంలో కొనసాగుతున్నది. తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం 15వ తేదీ గడువు ముగిసే సమయం వరకూ టెండర్ దాఖలు చేయాల్సి ఉన్నది. కానీ సింగరేణి దూరంగానే ఉండిపోయింది. పెంచిన గడువు ప్రకారం ఈనెల 20న (నేడు) సాయంత్రం వరకు చాన్స్ ఉన్నది. కానీ చివరి వరకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది.

ఇప్పటి వరకు టెండర్ ఎందుకు దాఖలు చేయలేదు?

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనుకునే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి ద్వారా టెండర్ వేసేందుకు ఆలోచిస్తున్నట్టు స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సింగరేణి నుంచి అధికారుల బృందం వైజాగ్ వెళ్లి టెండర్ ప్రక్రియ గురించి జనరల్ మేనేజర్ సహా సీనియర్ అధికారులతో మూడు రోజుల పాటు లోతుగా చర్చించారు. కానీ ఇప్పటివరకూ టెండర్ దాఖలు చేయకపోవడం విమర్శలకు దారితీసింది. ఎందుకు దాఖలు చేయలేదనే చర్చ అప్పట్లోనే జరిగింది.

సాంకేతికపరమైన అంశాలే కారణమా?.. లేక సంస్థ నిబంధనలతో చిక్కులు వస్తాయనే కారణంగా వెనకడుగు వేసిందా? అనే గుసగుసలూ వినిపించాయి. వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ ఆశాజనకంగా ఉండడంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గడువును ఏప్రిల్ 20 వరకు పొడిగించింది. అప్పటికే ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు, మరో 14 జాతీయ సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి. ఇందులో ఉక్రెయిన్‌కు చెందిన సంస్థ కూడా ఒకటి ఉన్నది. పోటీ సంతృప్తికరంగా ఉందని భావించిన ప్లాంట్ యాజమాన్యం మరింత లాభసాటిగా మారుతుందని భావించి గడువును పొడిగించింది. చివరి రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని యాజమాన్యం ఆశిస్తున్నది. గురువారం సాయంత్రానికి సింగరేణి తరఫున బిడ్ దాఖలైందా? లేదా? అనే విషయంపై స్పష్టత రానున్నది.

ఏపీ నేతల నుంచి విమర్శలు

తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 15న సింగరేణి తరఫున దరఖాస్తు దాఖలు కాకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సింగరేణితో బిడ్ వేయించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీలోని రాజకీయ నేతలు కూడా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ప్రయివేటీకరణ వద్దనే డిమాండ్‌ను తెరపైకి తెస్తూనే సింగరేణి ద్వారా టెండర్ ప్రక్రియలో పాల్గొనాలనే నిర్ణయం తీసుకోవడం రెండు నాల్కల ధోరణి అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. ప్రయివేటీకరణను వ్యతిరేకంగా ప్రభుత్వం టెండర్ ఎలా దాఖలు చేస్తుందని నిలదీశారు. ఇదంతా కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమేనని, చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నం కాదని ఫైర్ అయ్యారు.

చివరి వరకూ సస్పెన్స్

సింగరేణి బిడ్ దాఖలు చేస్తుందా? దాఖలు చేసినా అర్హత సాధిస్తుందా? అనే అనుమానమూ లేకపోలేదు. ఎల్-1 (తక్కువ ధర కోట్ చేసిన) సంస్థగా నిలుస్తుందా?.. లేక పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల్లో చివరి వరుసకే పరిమితమవుతుందా?.. అర్హత సాధించినట్లయితే సింగరేణి సంస్థ ఆ మేరకు నిధులను సమకూర్చగలుగుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సెంటిమెంట్ కోణం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిందలను భరించాల్సి వచ్చింది.

తెలంగాణ సంస్థకు చెందిన నిధులను ఆంధ్ర స్టీల్ ప్లాంట్ కోసం ఖర్చు చేయడమేంటని ఉద్యమకారులు, విపక్షాల నేతలు బహిరంగంగానే బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్ దాఖలు చేసి తెలంగాణ ప్రజల నుంచి మరిన్ని విమర్శలను మూటగట్టుకుంటుందా?.. ప్రతిష్ట కోసం, ఏపీలో రాజకీయ ప్రయోజనాలను టెండర్ ప్రక్రియలో పాల్గొంటుందా?.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటుంది?.. అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.


Next Story

Most Viewed