ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పిటిషన్ కొట్టివేత!

by Disha Web Desk 7 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పిటిషన్ కొట్టివేత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లను మరో పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రెండు రోజుల క్రితం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు.. సిట్ అధికారుల విజ్ఞప్తిని నిరాకరించింది. గతంలో రెండు రోజుల పాటు వీరిని విచారించారు కాబట్టి ఆ విచారణలో అన్ని రకాల సమాధానాలు తీసుకున్నారని అందువల్ల మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సిట్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. గత నెల 28న రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ప్రస్తుతం ఈ ముగ్గరు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా నిందితులు గతంలోనే ఏసీబీకోర్టులో తమ బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకోగా ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దాంతో వారు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా వీరి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చుతూ హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో మరో రెండు రోజుల్లో హైకోర్టులో తమ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా గతంలో రెండు రోజుల పాటు జరిపిన విచారణలో పూర్తి సమాచారం రాలేదని, ముఖ్యంగా వారు చేసిన వాట్సాప్ చాటింగ్ లు, ఎంత మందితో మాట్లాడారు అనే విషయంపై కొంత వరకే సమాచారం రాబట్టగలిగామని ఈ కేసులో లోతుగా విచారణ అవసరం ఉందని అందువల్ల మరో పది రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ ముగ్గురే కీలకం అని కస్టడీ పిటిషన్ లో పేర్కొనప్పటికీ ఏసీబీ కోర్టు మాత్రం సిట్ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.

Next Story

Most Viewed