MLA దుర్గం చిన్నయ్యకు షాక్.. క్యాంప్ ఆఫీస్ ఎదుట శేజల్ మెరుపు ధర్నా

by Disha Web Desk 4 |
MLA దుర్గం చిన్నయ్యకు షాక్.. క్యాంప్ ఆఫీస్ ఎదుట శేజల్ మెరుపు ధర్నా
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట అర్జిన్ డైరీ సిఈఓ శేజల్ ధర్నా చేయడం కలకలం రేపింది. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేరుకుంది. క్యాంప్ ఆఫీస్ ప్రధాన గేటు వద్ద నాకు న్యాయం కావాలంటూ ఫ్లకార్డుతో బైఠాయించింది. ఈ సందర్భంగా శేజల్ మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేసాడని, ఎంతో మంది అమ్మాయిలను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిసిందన్నారు.

ఎమ్మెల్యే అనుచరులు గత ఏడు నెలల నుంచి తనను బెదిరిస్తూ ప్రాణాపాయం తలపెట్టాలని చూస్తున్నారన్నారు. తనకు న్యాయం చేయాలంటూ పోరాడుతుంటే పోలీసులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. ఆడబిడ్డ న్యాయం కోసం పోరాడుతుంటే నిస్సిగ్గుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మద్దతు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పోలీసులతో కిడ్నాప్ చేయించి అక్రమంగా జైల్లో బంధించారని వాపోయారు.

న్యాయం కోసం పోరాడుతున్న ఆడబిడ్డకు పోలీసులు అన్యాయం చేస్తున్నారన్నారు. పోలీసులు దుర్గం చిన్నయ్యకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు. మీకు అక్కా చెల్లెలు నాలాంటి బిడ్డలు ఉంటే ఇలాగే చేస్తారా.. అని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అర్జిన్ డైరీకి ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ భూమిని ఎంతమందికి అమ్ముతారని ఆమె ప్రశ్నించారు.

దమ్ముంటే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్‌కి రావాలని సవాల్ విసిరారు. శేజల్ తొలుత హైదరాబాద్‌లో తనకు న్యాయం న్యాయం కోసం ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత ఢిల్లీకి వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పార్లమెంటు ముందు న్యాయం చేయాలని ధర్నా కూడా చేసింది. చివరకు బెల్లంపల్లికి చేరుకొని నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేయడం జిల్లాలో దుమారం లేపింది.

శేజల్ దీక్ష భగ్నం...

తనకు న్యాయం కావాలంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి ఆమెను బలవంతంగా అరెస్టు చేశారు. శంకరయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ మహిళా కానిస్టేబుల్‌తో వచ్చి దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆమెను ఎత్తుకు వెళ్తుంటే శేజల్ పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు. పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మద్దతు ఇవ్వడం మీకు సిగ్గుగా లేదా అని పోలీసులను ఎదురు ప్రశ్నించారు. మళ్లీ తప్పుడు కేసులు పెడతారని నిలదీశారు. బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించి శేజల్‌ను బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story

Most Viewed