పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం

by Disha Web Desk 2 |
పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన మరో మూడు బిల్లులపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్ ఏజ్‌ను 61 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకు గవర్నర్ నో చెప్పారు. ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. మరో రెండు బిల్లులపై వివరణ కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు. పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంతకాలం ఉన్న మూడేళ్ళ గడువును నాలుగేళ్ళకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై నిర్ణయం తీసుకునేముందు మరింత వివరణ అవసరమని రాజ్‌భవన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లుపై సైతం నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం నుంచి వివరణ కావాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

గవర్నర్ దగ్గర గతేడాది సెప్టెంబరు నుంచి మొత్తం పది బిల్లులు పెండింగ్‌లో ఉండగా మూడింటికి ఇటీవల ఆమోదం లభించింది. మరో రెండు రాష్ట్రపతి పరిశీలనకు వెళ్ళాయి. ఇప్పుడు రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరగా, ఒకదాన్ని తిరస్కరించారు. పెండింగ్ బిల్లుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై సోమవారం విచారణ జరగనున్నది. దీనికి కొన్ని గంటల ముందే రాజ్‌భవన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చట్ట సవరణ బిల్లు, యూనివర్శిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటును ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నాయి.

Also Read..

రెండేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాల్లేవ్: గవర్నర్

Next Story