పువ్వాడ vs రేణుకా చౌదరి.. మాటల తూటాలతో హీటెక్కిన ఖమ్మం!

by Disha Web Desk 2 |
పువ్వాడ vs రేణుకా చౌదరి.. మాటల తూటాలతో హీటెక్కిన ఖమ్మం!
X

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం మీద ఫోకస్ పెట్టిన పలు పార్టీల నాయకులు మంత్రి అజయ్‌ను టార్గెట్ చేస్తూ మాటల తూటాల పేల్చుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి మంత్రిపై విరుచుకుపడ్డారు. అదే రీతిలో మంత్రి కూడా కౌంటర్ ఇచ్చాడు. దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేసి తనపై గెలవాల్సిందిగా రేణుకాచౌదరికి సవాల్ విసిరాడు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సెన్సేషనల్ కామెంట్ చేయడంతో ఖమ్మం రాజకీయాలు ఇప్పుడే హాట్‌హాట్‌గా మారిపోయాయి.

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లా రాజకీయం నాయకుల మాటల తూటాలతో వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ గేమ్ షురూ అయింది. అధికార పార్టీలో అసలే ఓ పక్క పొంగులేటి ఎపిసోడ్ నడుస్తుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మాటలు కాక పుట్టిస్తున్నాయి. ఖమ్మంలో సోమవారం నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరీ మంత్రి పువ్వాడ అజయ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

మాటల తూటాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా మంత్రి అజయ్‌ను టార్గెట్ చేసుకుంటూ హస్తం నేతలు ముందుకు కదులుతున్నారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి అజయ్‌ను ఒంటికన్ను శివరాసన్‌తో పోల్చగా.. రేణుకా చౌదరి మాత్రం కబ్జాకోరంటూ మాటల తూటాలు పేల్చారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న హస్తం పార్టీకి మంత్రి అజయ్‌ను టార్గెట్ చేస్తేనే మేలైజీ వస్తుందని గ్రహించి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా అజయ్‌పై ఎక్కుపెట్టిన విమర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత జోష్ నిండినట్లయింది.

రేణుకపై ఫైర్..

గతం నుంచే రేణుక, అజయ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈక్రమంలోనే రేణుకా చౌదరి ఖమ్మం వచ్చినప్పుడల్లా మంత్రిపై విమర్శలు చేస్తూనే ఉంటారు. మొన్నటి కాంగ్రెస్ నిరసన ర్యాలీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మంత్రి అజయ్ సైతం రేవంత్, రేణుకకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె పబ్బుల సంగతి అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె తనపై ఖమ్మం నియోజకవర్గంనుంచి పోటీచేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు.. ఈసవాల్ స్వీకరించి పోటీకి సిద్ధం కావాలన్నారు. అంతేకాదు. పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని, టికెట్లు ఇప్పిస్తానని డబ్బులు దండకుంటున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్‌రెడ్డి మాటలు జిల్లాలో ఎవరూ వినే పరిస్థితి లేదని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చినందునే పీసీసీ అధ్యక్షుడివి కాగలిగావని ఆ పదవి కూడా బీఆర్ఎస్ పెట్టిన భిక్షేనని స్పష్టం చేశారు అజయ్.

హీటెక్కిన ఖమ్మం..

ఉమ్మం ఖమ్మం అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఐదు స్థానాలు గెలుపొందగా.. అధికార పార్టీ ఒక్క సీటునే గెలుచుకుంది. అనంతరం ఒక్క భట్టి విక్రమార్క తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కారెక్కారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మంలో ఎలాగైనా పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా మంత్రిఅజయ్‌ను టార్గెట్ చేస్తేనే మైలేజీ వస్తుందని భావించిన రేవంత్, రేణుకా ఈసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అజయ్ సైతం అదే విధంగా స్పందించి మాటలకు మరింత పదును పెంచారు. కరోనా సమయంలో కాకరకాయ కూడా ప్రజలకు పంచని మీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి ఎదిగారా అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో వచ్చే వాళ్లు వస్తూ ఉంటారని, వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్తో పాటు పొంగులేటి వర్గాలు ఉమ్మడి జిల్లాపైనే ఫోకస్ పెట్టడంతో రాజకీయం మరింత వేడెక్కనుంది.


Next Story

Most Viewed