తెలంగాణ బిడ్డలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి: రామ్మోహన్ రెడ్డి డిమాండ్

by Satheesh |   ( Updated:2024-06-12 15:21:34.0  )
తెలంగాణ బిడ్డలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి: రామ్మోహన్ రెడ్డి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొట్లాడిన విద్యార్ధులను బీజేపీ, బీఆర్ఎస్ పొట్టన పెట్టుకున్నదని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ఇందుకు కేంద్ర సహాయక హోం మంత్రి బండి సంజయ్ చొరవ చూపించాలన్నారు. మన స్టేట్ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులకు అవకాశం వచ్చిందని, రాష్ట్ర డెవలప్‌కు కృషి చేయాలన్నారు. గడిచిన పదేళ్లుగా మోడీ తెలంగాణను పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ కూడా మోడీ వైఫల్యాలను ఏనాడు ఎండగట్టలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది ఏండ్ల నుండి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదన్నారు.

కానీ, ఈ సారి మీరు కుంటి సాకులు చెప్పడానికి అవకాశం లేదన్నారు. రద్దు చేసిన ఐటీఐఆర్‌ను కూడా పునరుద్ధరించాలన్నారు. పేపరుకే పరిమితమైన పసుపు బోర్డును, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి జూన్ 24న ఉన్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలన్నారు. మూసి నది ప్రక్షాళన కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బడ్జెట్లో నిధులు సాధించాలన్నారు. మన స్టేట్‌కు నిధులు తీసుకురావడంతో ఇతర రాష్ట్రాల కేంద్ర మంత్రులతో పోటీ పడాలన్నారు. ఈసారి కూడా నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. బీజేపీ చేసిన తప్పిదాలన్నీ ప్రజల ముందు ఉంచుతామన్నారు.

Advertisement

Next Story