కంటోన్మెంట్‌లోనే సైనిక్ స్కూలు.. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేలా ప్లాన్

by Disha Web Desk 1 |
కంటోన్మెంట్‌లోనే సైనిక్ స్కూలు.. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేలా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు రాష్ట్రానికి సైనిక్ స్కూలు మంజూరయ్యేందుకు అవకాశాలు మరింత మెరుగయ్యాయి.సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో సైనిక్ స్కూలును నెలకొల్పేందుకు సంబంధించిన ఫైల్‌పై కదలికలు ప్రారంభమయ్యాయి. గతంలో ములుగు జిల్లాలో నెలకొల్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించినా.. కొత్త ప్రభుత్వం మాత్రం దీన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆవరణలోనే ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉంది. స్కూలు ఏర్పాటుకు దాదాపు 50 ఎకరాల స్థలం అవసరం కావడంతో రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ అందుకు సరైన ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ స్థలానిక ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మరోచోట స్థలాన్ని సమకూర్చేందుకు రక్షణ శాఖను ఒప్పించనుంది.

సైనిక్ స్కూలు ఏర్పాటుకు రక్షణ శాఖ నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ రావడంతో దానికి సంబంధించిన అంశాలపై విద్యా శాఖ అధికారులతో ప్రధాన కార్యదర్శి చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్ల తరహాలోనే సైనిక్ స్కూలును కూడా నిర్వహించాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. స్కూలు ఏర్పాటుకు అవసరమయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్లు ఖర్చు కావొచ్చని అంచనా వేసినా ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన చర్చల సందర్భంగా ఆ స్కూలు ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిగిన తర్వాత కదలిక మొదలైంది. త్వరలోనే నిర్దిష్ట ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర అధికారులు పంపనున్నారు.



Next Story

Most Viewed