రూ.2 లక్షల రుణమాఫీ ప్రజలను మభ్యపెట్టడానికే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

by Disha Web Desk 1 |
రూ.2 లక్షల రుణమాఫీ ప్రజలను మభ్యపెట్టడానికే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మళ్లీ మోసం చేయడానికి పూనుకుంటున్నారని అందులో భాగంగా ఆగస్టు 15 వరకు రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఐదో ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 రోజు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తా చెప్పారని వంద రోజుల పాలన పూర్తయిన అమలు చేయలేక విఫలమయ్యారని విమర్శించారు.

వరి పంటకు మద్దతు ధర‌తో పాటు రూ.500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఏమి చేయలేదన్నారు. మళ్లీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పేరుతో ముందుకు వస్తున్నారని ఇప్పుడు బోనస్ ఇవ్వలేదు కానీ వచ్చే వరి పంటకు బోనస్ ఇస్తా అంటూ వాయిదా వేస్తున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీనా అని ఆయన నీలదీశారు. ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద హామీల అమలుకు నిధులు లేవని తెలియదా అని అయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతిపరులని అనేక సార్లు విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో చేరగానే అవినీతి తొలిగిపోతుందా సమాధానం చెప్పాలన్నారు. రాజకీయంగా ఉనికి కోల్పోయిన ఆ పార్టీనీ ఎందుకు రోజూ ఏదో ఒక రకంగా తెర మీదకు తెస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మోఢీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, గత పది ఏళ్లుగా చేసిన అభివృద్ధి‌తో మోడీ నుంచి ప్రజల దృష్టి మరల్చలేరని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థి మాధవీ లతను చూసి వారికి ఓటమి భయం పట్టుకుందని, ఓవైసీ ఓటమి భయంతో ఏమి మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదన్నారు.

ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలి...

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ.. బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ని కలిసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మెమొరాండం సమర్పించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ కళ్యాణ మహోత్సవం‌పై ఆంక్షలు విధించడం చాలా విచారకరమన్నారు. గత 40 ఏళ్లుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇందులో రాజకీయ పరమైన కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాత్ర అన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా కళ్యాణానికి వెళ్లకుండా కేవలం తలంబ్రాలు మాత్రమే పంపి అవమానించారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఎలాంటి గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తే వారికీ కూడా అలాంటి గతే పడుతుందన్నారు. శ్రీరామ నవమి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని అయన డిమాండ్ చేశారు.


Next Story