బహుజనులకు రాజ్యాధికారం దక్కితేనే SC ఉపకులాలకు న్యాయం: RSP

by Disha Web Desk 19 |
బహుజనులకు రాజ్యాధికారం దక్కితేనే SC ఉపకులాలకు న్యాయం: RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరగాలంటే బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో దళిత బంధు కోసం 57 ఎస్సీ ఉపకులాల ఐక్యంగా నిర్వహించిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సీల్లోని ఉపకులాలైన మోచీ, హోలియదాసరి, బైండ్ల, చిందోల్లు, మష్టిన్, గోసంగి, డక్కలి నేటికీ భిక్షాటన చేస్తూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో ఏండ్లుగా దళితులకు అందించే ప్రభుత్వ పథకాలు కూడా ఉపకులాలకు దక్కడం లేదన్నారు. ఎస్సీ ఉపకులాల ప్రజలు చెప్పులరిగేలా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా కులం సర్టిఫికెట్​జారీ చేయడం లేదన్నారు. తక్షణమే ఎస్సీ ఉపకులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దన్న ఆయన ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడే పార్టీలు గెలిపించాలని కోరారు.

దళిత బంధు ఉచ్చులో చిక్కుకున్నారు: తీన్మార్ మల్లన్న

సీఎం కేసీఆర్ దళిత బంధు మాదిగ కులాలకే సరిగ్గా ఇవ్వడం లేదు.. 57 ఉపకులాలకు ఇస్తాడా అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. కేసీఆర్ వేసిన దళిత బంధు ఉచ్చులో ఎస్సీ ఉపకులాల ప్రజలు చిక్కుకున్నారని అన్నారు. కొడంగల్‌లో పుట్టిన రేవంత్, హైదరాబాద్‌లో పుట్టిన కవిత నిజామాబాద్, నల్గొండలో పుట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరిలో పోటీ చేసిన ఈ సంచార జీవులకు ఎస్సీ ఉపకులాలకు ఏం తేడా లేదన్నారు. ‘మీరు అందరూ మమ్మల్ని ఓసీలో కలపండి అని డిమాండ్ చేయండి’ అని సూచించారు. అప్పుడే అసలు డిమాండ్లు పరిష్కారం అవుతాయన్నారు. ఒక శాతం జనాభాకు (ఈడబ్ల్యూఎస్ ) 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు తెలిపారు.

లక్షల జనాభా ఉన్న మీ 57 కులాలకు 5 శాతం రిజర్వేషన్ ఉన్నదని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. వెలమలు ఎప్పుడన్నా ధర్నా చౌక్‌లో ధర్నా చేశారా? అధికారం వాళ్ళ చేతిలో ఉందన్నారు. అధికారం తమ చేతిలో ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తెలంగాణలో బాల సంతల గుడిసెల కంటే.. వెలమల ఇల్లే తక్కువ ఉన్నాయన్నాయని విమర్శించారు. ఓటు హక్కు లేకపోతే తమను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదని, ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఈ ధర్నాలో 57 ఉప కులాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed