టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో రాజకీయ నాయకుల పాత్ర?

by Disha Web Desk 6 |
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో రాజకీయ నాయకుల పాత్ర?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్సీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారి వెంకటేశ్వర్లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తులో కొందరు రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యం అయ్యాయని, ఈ కేసులో వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కలిసి లక్ష్మిని ట్రాప్ చేసి పాస్ వర్డ్, ఐటీలను దొంగిలించారని ఇప్పటికే గుర్తించిన సిట్.. ఏయే పేపర్లు లీక్ అయ్యాయనే కోణంలో దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ ఎవరెవరికి పేపర్లు ఇచ్చారన్న దానిపై దృష్టి సారించారు.

ప్రవీణ్, రాజశేఖర్ తో పాటు మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన అధికారులు అక్కడి నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లబోతున్నారు. అయితే అనూహ్యంగా ఇందులో రాజకీయ నేతల పాత్ర ఉందనే అనుమానాలు ఆసక్తిగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి దిగిన ఫోటోలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో రాజకీయ నాయకుల పాత్రపై చర్చ సంచలనంగా మారుతోంది.

Next Story

Most Viewed