Revanth Reddy ఉక్కిరిబిక్కిరి.. హై కమాండ్‌‌కు తరచూ కంప్లైంట్స్!

by Disha Web Desk 4 |
Revanth Reddy ఉక్కిరిబిక్కిరి.. హై కమాండ్‌‌కు తరచూ కంప్లైంట్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ అడుగు వేసినా.. టీపీసీసీ చీఫ్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల పార్టీలో కొత్త కమిటీలు వేయగా, సీనియర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డిని టచ్ చేయకుండా.. ఆయనకు సహకరించే వారిని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు బీజేపీ కూడా అసంతృప్తులను లాక్కునేందుకు పావులు కదుపుతున్నది. దీంతో రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కొత్త కమిటీలతో వివాదం

ఇటీవల వేసిన టీపీసీసీ జంబో కమిటీ, జిల్లా పార్టీ అధ్యక్షుల జాబితాలో రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపించింది. దీనిపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. సీనియర్లు సైతం తీవ్రంగా విమర్శించారు. భట్టి నేతృత్వంలో ఓ టీం, దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో మరో టీం.. ఇలా రేవంత్‌పై కత్తులు నూరుతున్నాయి. కొత్త టీంతో ఎన్నికలకు వెళ్తామని రేవంత్ వర్గం చెప్పుకుంటున్న సమయంలోనే.. కోవర్టులకు పదవులు ఇచ్చారంటూ రాజనర్సింహా బాంబు పేల్చారు. దీంతో పార్టీలో కోవర్టులెవ్వరో.. నమ్మకస్తులు ఎవరో అనేది తేల్చుకోలేని ఆయోమయం నెలకొంది.

అసంతృప్తులకూ ఖర్గే అపాయింట్ మెంట్..

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఏఐసీసీకి రోజుకో కంప్లయింట్ వెళ్తున్నది. ఒకదశలో రేవంత్ రెడ్డిది, తనదీ పక్క పక్క నియోజకవర్గమే.. మేమిద్దరం దోస్తులమే అంటూ హైదరాబాద్‌కు వచ్చి చెప్పిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే కూడా ఇప్పుడు ఈ ఫిర్యాదుల పరంపరతో విసుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే, రేవంత్ రెడ్డికి చాలా సపోర్ట్‌గా ఉంటారని, ఏఐసీసీలోనూ రేవంత్ రెడ్డికి పట్టు దొరికిందని ఆయన వర్గం సంబురపడేలోగానే ఖర్గే నుంచి రివర్స్ ఫలితాలు వస్తున్నాయి. యాంటీ రేవంత్ టీంకు ఖర్గే అపాయింట్మెంట్ వెంటనే దొరుకుతున్నది. అంతేకాదు.. ఉప్పు.. నిప్పులా ఉన్న ఎంపీ వెంకట్ రెడ్డికి ఖర్గే నుంచి స్పష్టమైన హామీ వచ్చిందనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది.

టీఆర్ఎస్, బీజేపీ నుంచీ టార్గెట్

రేవంత్ రెడ్డికి అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నుంచి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేవంత్‌ను కాకుండా.. ఆయనకు సహకరిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో రేవంత్ బంధువు పేరు బయటకు వచ్చింది. ఇటీవల రేవంత్ రెడ్డికి ఆర్థిక సాయం చేస్తున్నారని అనుమానాలున్న రియల్ వ్యాపారిపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఇలా బహిరంగంగా కొన్ని.. అంతర్గతంగా మరికొన్ని రేవంత్ రెడ్డికి సహకరించేవారికి బెదిరింపులు వెళ్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా పోస్టుల వివాదంలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడులు జరిగాయి. దీనిపై రేవంత్ వర్గం నాయకులు మాత్రమే ఖండించడం గమనార్హం. అంతేకాకుండా కాంగ్రెస్ అసంతృప్తులను బీజేపీ వల వేస్తుండడంతో మరిన్ని తలనొప్పులు వస్తున్నాయి.

కీలక సమయంలో వెనకడుగు..!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే రాజకీయాలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార పార్టీ సంక్షేమ పథకాల్లో స్పీడ్ పెంచింది. అటు బీజేపీ కూడా రాష్ట్రంపై ఫోకస్ పెంచింది. కానీ, కాంగ్రెస్ మాత్రం సొంత నేతల వివాదాలతో సతమతమవుతున్నది. ఇప్పటి వరకైతే కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా.. టీఆర్ఎస్, బీజేపీ రోజుకో అంశాన్ని ఎత్తుకుని విమర్శలకు దిగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో ఉందా.. లేదా అనే పరిస్థితుల్లో కనిపిస్తున్నది. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత విభేదాలను వీడి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల ఫెయిల్యూర్స్ వంటి అంశాలపై దృష్టి పెడితే కొంత ఫలితం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎటు అడుగు వేస్తే.. ఎటు వైపు నుంచి సొంత పార్టీ నేతలు బాణాలు ఎక్కుపెడుతారోననే భయం ఆయనలో కనిపిస్తున్నది.

Also Read...

Bandi Sanjay మరో కీలక నిర్ణయం.. నడ్డాతో బిగ్ ప్లాన్!

Next Story

Most Viewed