కాళేశ్వరం పాపం ఆ ఇద్దరిదే.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
కాళేశ్వరం పాపం ఆ ఇద్దరిదే.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారం అని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం సరికాదని గతంలో కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే నివేదిక ఇచ్చిందని అయినా వాటిని పట్టించుకోకుండా మేడిగడ్డ కట్టారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పురుగు పుట్టిందే కేసీఆర్ పుర్రెలో అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు కానీ ఆయనే ఇంజినీర్లకు సలహాలు ఇచ్చారని తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని ఇంజినీర్ల కమిటీ సూచిస్తే కేసీఆర్ మాత్రం మేడిగడ్డ వద్ద నిర్మించారని మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్ రావు కలిసి ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇకనైనా జరిగిన తప్పులకు హరీశ్ రావు క్షమాపణలు చెప్పి సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరకుండా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడితే గతంలో అంటున్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విషయాలను మీకు గుర్తు చేస్తున్న.. ప్రాణహిత చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఏపీ సీఎం చర్చించారు. 2012 లో స్టాండింగ్, కో-ఆర్డినేషన్ కమిటీలను వేశారు. ఆనాడు ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యేది 1850 ఎకరాల పట్టా భూములు మాత్రమే. కానీ తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇస్తే ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అలుళ్లు ప్రాజెక్టు నిర్మించారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని మీ మిత్రుడి పత్రిక సాక్షిలో రాశారని తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలని, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు... కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందన్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా? హరీష్ రావును నేను నిలదిస్తున్నా.. ఈ దుర్మార్గాలకు, ఈ పాపాలకు కారణం మీరు, మీ మామా అల్లుళ్లు కారణం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు... తొండి వాదనలు వద్దు హరీశ్.. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా? అని ప్రశ్నించారు. చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు వారి పక్కనే ఉన్నారు. ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క ఇవాళ హరీష్ రావును సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed