వేద మంత్రాల మధ్య తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

by Harish |
వేద మంత్రాల మధ్య తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ ఆలయ తలుపులు ఆదివారం ఉదయం 6 గంటలకు పూర్తి ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయం మొత్తం కూడా 'బద్రీ విశాల్ లాల్ కీ జై' నినాదాలతో మార్మోగింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆలయం తెరుచు కోవడంతో భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చారు. వేద పండితులు మంత్రాలను పఠిస్తూ, ఆర్మీ బ్యాండ్ భక్తి గీతాల మధ్య ఆలయ తలుపులు తెరిచారు. అంతకుముందు పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ బద్రీనాథ్ ధామ్ పుణ్యక్షేత్రం శీతాకాలం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆదివారం తెరుచుకున్న ఆలయం నవంబర్ వరకు తెరిచే ఉంటుంది. విష్ణువు ఈ ఆలయంలో బద్రీనాథుడిగా కొలువై ఉన్నారు. దక్షిణ ద్వారం నుండి ఆలయ ప్రాంగణానికి కుబేర్ జీ, శ్రీ ఉద్ధవ్ జీ, గడు ఘడను తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రావల్‌, ధర్మాధికారి, హక్‌ హుకుక్‌ధారి, శ్రీ బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధికారులు పాలకవర్గం, వేలాది మంది భక్తుల సమక్షంలో పూజాకార్యక్రమాలతో ఆలయ తలుపులు తెరిచారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. మే 10న ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. గత రెండు రోజులుగా కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి సహా మూడు ధామ్‌లకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. కేదార్‌నాథ్ ధామ్‌‌ను మొదటి రోజు దాదాపు 29,000 మంది భక్తులు సందర్శించారు.

Next Story

Most Viewed