జూబ్లీహిల్స్‌‌లో సీఎం క్యాంప్ ఆఫీస్.. స్వయంగా పరిశీలించిన రేవంత్

by Disha Web Desk 2 |
జూబ్లీహిల్స్‌‌లో సీఎం క్యాంప్ ఆఫీస్.. స్వయంగా పరిశీలించిన రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇకపైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ) ప్రాంగణంలోకి రానున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రగతి భవనే సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. దీన్ని తాజా ప్రభుత్వం జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చడంతో సీఎం క్యాంపు కార్యాలయం మరోచోటికి షిప్ట్ కావాల్సి వచ్చింది. దీనికి అనుగుణంగానే ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ ప్రాంగణంలో గుట్టమీద ఉన్న బ్లాక్‌లోకి మార్చే ఆలోచనలు తెరమీదకు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ భవనాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండడంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గర్లోనే (రోడ్ నెం. 25, జూబ్లీహిల్స్) ఉన్న హెచ్చార్డీ ప్రాంగణంలోకి మారుతున్నది.

దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెచ్చార్డీ ప్రాంగణంలో ఒకేసారి దాదాపు 150 మంది చొప్పున కూర్చునే నాలుగు కాన్ఫరెన్సు హాళ్ళు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే రెగ్యులర్‌గా జరిగే కాన్ఫరెన్సులు, లెక్చర్లు, ట్రెయినింగ్ తదితర యాక్టివిటీస్‌కు సెక్యూరిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా విడి ఎంట్రీగా గుట్టమీద ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసేలా ఆలోచనలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నది.



Next Story