ఖగోళ శాస్త్ర పరిశోధనలకు భారత్ అనువైన దేశం.. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విఠల్ టిల్వి

by Dishafeatures2 |
ఖగోళ శాస్త్ర పరిశోధనలకు భారత్ అనువైన దేశం.. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విఠల్ టిల్వి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలో ఖగోళ శాస్త్ర, సముద్ర వాతావరణ పరిశోధనలకు భారత్ అనువైన దేశమని సుదూర సమూహ గెలాక్సీల స్థాపకులు, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విఠల్ టిల్వి పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. “ లోతైన మహాసముద్రం నుంచి ఎత్తైన అంతరిక్షం వరకు” అనే అంశంపై ముఖ్య అతిథిగా హాజరైన విఠల్ టిల్వి మాట్లాడుతూ.. భారతదేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని, అటు సముద్రంలోని ఆటుపోట్లను ఇటు అంతరిక్షంలోని నక్షత్రాల ఉనికిని పసిగట్టేలా వాతావరణం ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పరిశోధకుల్లో చాలా మంది మన దేశం నుంచి ఉండడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆయా విభాగాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డిగ్రీ స్థాయిలో ఖగోళ శాస్త్ర అధ్యయనం ఒక కోర్సుగా పెట్టే అంశాన్ని పరిశీలిస్తాము అని ప్రకటించారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్ కోర్సులను మరింత విరివిగా పరిచయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సైన్స్ విభాగ డీన్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వర్సిటీ విద్యార్థులు ప్రత్యేక వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఆయా స్టాల్ల్స్ దగ్గర విద్యార్థుల కోలాహలం కనిపించింది.

Next Story

Most Viewed