'కాంట్రాక్టు డిగ్రీ, జూనియర్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి'.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌కి వినతి

by Disha Web Desk 13 |
కాంట్రాక్టు డిగ్రీ, జూనియర్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌కి వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మిగిలిన కాంట్రాక్టు డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వెంటనే చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, టీఐజీఎల్ఏ, జీసీఎల్ఏ 475 సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌ని సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అధ్యాపకులందరి క్రమబద్ధీకరణ అతి త్వరగా జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇంటర్ విద్యలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి డిపార్ట్మెంట్ బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేయవలసిందిగా కోరారు. గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం వలన మానసిక, ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగుల బాధలను గమనించి సత్వరమే బదిలీల జరగడానికి కృషి చేయాలని కోరారు.

పది శాతం నాన్ టీచింగ్ సిబ్బందికి జూనియర్ అధ్యాపకులుగా ప్రమోషన్లు వెంటనే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జూనియర్ కాలేజీల రీ ఓపెనింగ్ అయిన వెంటనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. కళాశాల ఓపెనింగ్ నుంచి విద్యార్థులకు అధ్యాపకులను అందుబాటులో ఉంచి గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలన్నారు. కళాశాలలో మౌలిక వసతులు, స్వీపర్లు అటెండర్లను వాచ్ మెన్ లు నియమించాలన్నారు.

సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుని త్వరలో సమన్వయ ఉన్నతాధికారులు, సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘాల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, టీఐజీఎల్ఏ, జీసీఎల్ఏ 475 రాష్ట్ర నాయకులు మైలార జంగయ్య, మాచర్ల రామకృష్ణ గౌడ్, మంజు నాయక్, సైదులు, బిఖ్యా నాయక్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed