ఆయుష్‌ కేంద్రాలకు ఆదరణేది?

by Disha Web Desk 12 |
ఆయుష్‌ కేంద్రాలకు ఆదరణేది?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/తలకొండపల్లి: పట్టణం, మున్సిపాలిటీ, మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం సముదాయంలోనే ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా, నేచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ ఇది ప్రస్తుతం తమిళనాడు లో మాత్రమే కొనసాగుతుంది. హెచ్ అంటే హోమియోపతి అని అర్థం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 24 ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలోని పట్టణాలు, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో కొనసాగుతున్న ఆయుర్వేదిక్ హోమియోపతి కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం ఆయుర్వేదిక్ కేంద్రాలకు అక్కడక్కడా కొంత మంది డాక్టర్లు ఉన్నా పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉన్న ఆస్పత్రిలో డాక్టర్లు లేకపోవడంతో పేషెంట్లు రావడం లేదు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి హోమియోపతి కేంద్రాలకు పుష్కలంగా మందులను సరఫరా చేస్తున్నా వినియోగించుకునే వారు కరువయ్యారు. దీంతో మందుల గడువు ముగిసి వాటిని కూడా బయటపడేయాల్సిన పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో జాపాల్, కోహెడ, నజిక్ సింగారం, తలకొండపల్లి, ముద్విన్, హైదర్‌గూడ, జన్వాడ, ఇబ్రహీంపట్నం, జిల్లేడు, ఇర్వేన్‌లో ఉన్నాయి. యునాని ఆయుర్వేద కేంద్రాలు జహంగీర్ పీర్ దర్గా, ఆలూర్, కొత్తపేట, మొగిలిగిద్ద, నందిగావ్, పహాడి షరీఫ్, చంపాపేట్, ధోబిపేట, శంషాబాద్, మంకల్‌లో కొనసాగుతున్నాయి. ప్రజా హోమియో ఆరోగ్య కేంద్రాలు వనస్థలిపురం, చిలుకూరు, అమనగల్లు, నాదర్గుల్ లో కొనసాగుతున్నాయి.

కేవలం హోమియో ఆరోగ్య వైద్య కేంద్రాల్లో మాత్రమే పేషెంట్లు మందులు తీసుకోవడానికి వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా స్టాప్ రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో జిల్లాలోని ఇంత వరకు ఎక్కడా ఆయుర్వేదిక్ ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా డాక్టర్లను, సిబ్బందిని నియమించలేదు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో స్టాఫ్ ను ఏర్పాటు చేయకపోవడంపై రోగులు మండిపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 80వేల ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు ప్రకటించిన సమయంలో ఆయుర్వేదిక్ ఆసుపత్రిలోని ఫార్మసిస్టులను ఎంపిక చేయడానికి జిల్లాలోని ఆయుర్వేదిక్ కు లో 136 హోమియోపతిలో 54 యునానిలో 118 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించినా అమలుకు మాత్రం నోచుకోలేదు.

యోగా షెడ్ల నిర్మాణం వట్టి మాటలేనా..

జిల్లాలోని ప్రభుత్వ ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా షెడ్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రూ.6 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినా.. ఇప్పటి వరకు నిర్మించలేదు. రాష్ట్రంలోని పక్క జిల్లాలైన హైదరాబాద్ వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో యోగా షెడ్ లో నిర్మాణాలు జరిగినా రంగారెడ్డి జిల్లాలో నిర్మాణం జరగకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయుర్వేదిక్ మందులపై పట్టణ కేంద్రాల్లోనే మక్కువ

దేశంలోని ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతంలోనే ఉంటుంది. గ్రామాల్లో ఏవైనా వ్యాధులు వస్తే నాటు వైద్యంపై ఆధారపడతారు. వారు కూడా ఆయుర్వేదిక్ వైద్యంను ఆశ్రయించక పోవడంపై పలువురు వైద్యులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మాత్రం ఆయుర్వేదిక్ ఆసుపత్రుల వద్ద దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం అవగాహన లోపమనే తెలుస్తోంది.

ఉన్న పోస్టులతోనే కాలం గడుపుతున్న ఆయుర్వేద వైద్యశాలలు..

అధికారిక లెక్కల ప్రకారం ఒక్కో ఆయుర్వేద వైద్యశాలలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఫార్మసిస్ట్, ఒక ఎంఎన్ఓ, ఒక ఎస్సీఎస్ లేదా పీటీఎస్ పోస్టును భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ తలకొండపల్లి మండలంలో మాత్రం ఒక మెడికల్ ఆఫీసర్, స్వీపర్ పోస్టుతోనే కాలం గడుపుతున్నారు. గట్టు ఇప్పలపల్లి గ్రామంలో మాత్రం 2009లో ఎన్ఆర్‌హెచ్ఎం స్కీం కింద ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వహించే మెడికల్ ఆఫీసర్ 18 నెలల క్రితం ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయింది. కేవలం ఇప్పుడు హాస్పిటల్ లో కాంటాక్ట్ బేసిక్‌పై ఫార్మసిస్టు, ఎస్ఎన్ఓతో మాత్రమే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రోగలను పరీక్షించే డాక్టర్ లేకపోవడంతో ఎవరు కూడా ఆస్పత్రికి రావడానికి మక్కువ చూపడం లేదు.


Next Story

Most Viewed