స్వచ్ఛమైన నీటికి నోచుకోని పల్లెలేన్నో?

by Dishafeatures2 |
స్వచ్ఛమైన నీటికి నోచుకోని పల్లెలేన్నో?
X

దిశ, తలకొండపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలపై గళం ఎత్తి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే పల్లెల్లో తాగునీరు కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులను తీర్చడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ అనే పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి గడపకు తాగునీరు అందించాలనే ధృడసంకల్పంతో ముఖ్యమంత్రి మిషన్ భగీరథ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ కొన్ని గ్రామాలలోని వాటర్ ట్యాంకులకు పూర్తిస్థాయిలో నీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా తయారయింది తలకొండపల్లి మండలంలోని మిషన్ భగీరథ నీళ్ల పరిస్థితి. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడు అనే చందంగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

66 గ్రామాలకు 82 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా భగీరథ నీటి సరఫరా

మండలంలోని అన్ని కలుపుకొని మొత్తము 66 గ్రామాలు, గిరిజన తండాలతో కలిపి 32 గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఒక్కో మనిషికి 100 లీటర్ల చొప్పున ప్రతి కుటుంబానికి 300 నుండి 400 లీటర్ల నీరు అందించాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తలకొండపల్లి మండలంలోని అధికారుల లెక్కల ప్రకారం సుమారు 50 వేల జనాభాకు గాను 13963 ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లుగా ధ్రువీకరించారు. కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందకపోవడంతో తాము ఏం పాపం చేశామని ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్ మండలంలోని కర్కల్పాడు గేటు సమీపంలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి నిర్మించారు. అక్కడినుండి ఆమనగల్లు, కడ్తాల్, మాడుగుల ,తలకొండపల్లి మండలాలలోని ప్రతి గ్రామానికి, తండాకు తాగునీరు ప్రతినిత్యం సరఫరా చేస్తుంటారు.

తలకొండపల్లి మండలంలోని 40 గ్రామాలకు మాత్రమే త్రాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తూ, మిగతా గ్రామాలకు చాలి చాలని నీరు అందుతుందని ఆయా గ్రామాల సర్పంచులు మండల సర్వసభ్య సమావేశాలలో సైతం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముందు తమ గోడును చెప్పుకొని వాపోతున్నారు. సర్పంచులుగా గెలిచిన పాపానికి మేము పల్లెల్లో త్రాగు నీరు కూడా సక్రమంగా తాపకపోతే చెడ్డ పేరు వస్తుందని, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు చాలీచాలని నీళ్లు రావడంతో వారు చివరకు చేసేది ఏమీ లేక అందుబాటులో ఉండే ఉప్పు నీరును కూడా ట్యాంకుల్లో కలుపుతూ రెండు నీళ్లను వదులుతున్నారు.

వాటర్ ఫిల్టర్స్ వద్ద క్యూ కడుతున్న మహిళలు

మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో ఆయా పల్లెల్లోని ప్రజలందరూ వాటర్ ఫిల్టర్స్ వద్దకు క్యూ కట్టవలసిన పరిస్థితి దాపరించింది. ఆ వాటర్ ఫిల్టర్స్ యజమానులు ఇదే అదునుగా భావించి 20 లీటర్ల బాటిల్ నీళ్లకు 10 నుండి15 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నిజంగా అవి ఏ మేరకు ఫిల్టర్ చేస్తున్నారు? ఫ్లోరిన్ ఎంత పర్సంటేజీ వాటర్ లో ఉంది? అని తనిఖీ చేసేందుకు అధికారులు పత్తాలేరు. ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. మండలంలోని అంతారం, చంద్రధన, లింగరావుపల్లి, హర్యానాయక్ తండ, సూర్య నాయక్ తండ, మాదాయపల్లి, మెదక్ పల్లి, తుమ్మల కుంట తండా, వీరన్నపల్లి, వెంకటాపూర్ గ్రామాలతో పాటు మరికొన్ని గిరిజన తండాలు, గ్రామాలకు కూడా చాలీచాలని నీరు అందుతుందని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశంలో సైతం ఎమ్మెల్యే ముందు తమ గోడును చెప్పుకొని గతంలో ఆవేదనను వ్యక్తం చేశారు.

పై గ్రామాలకు సరిపడా నీళ్లు రాకపోవడంతో ఏమీ చేయలేక గ్రామపంచాయతీ మోటార్ల ద్వారా రెండు నీళ్లు మిక్స్ చేసిన వాటర్ ను పంచాయితీ వాళ్లు ట్యాంకుల ద్వారా ట్యాప్ లోకి వదలడంతో కల్తీ నీరు త్రాగి చాలామంది వృద్ధులు, మహిళలు,చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి పెట్టి వెంటనే అన్ని గ్రామాలకు సమపాలల్లో మిషన్ భగీరథ నీళ్లు అందించే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల సర్పంచులు అధికారులను కోరుతున్నారు. మిషన్ భగీరథ గ్రిడ్డు డిఈ సందీప్ ను దిశ వివరణ కోరగా మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు సరిపడా వెళ్లడం లేదని, మిగతా అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో వెళుతుంది. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే సరి చేస్తామని వివరణ ఇచ్చారు. సంబంధిత ఏఈ లీవ్ లో ఉన్నారని వివరణ ఇచ్చారు.



Next Story