రెచ్చిపోయిన కబ్జాదారులు.. రెండు నెలల్లో 4 సార్లు గండి

by Disha Web Desk 12 |
రెచ్చిపోయిన కబ్జాదారులు.. రెండు నెలల్లో 4 సార్లు గండి
X

దిశ, బడంగ్​పేట్​: మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్​కార్పొరేషన్​పరిధిలో 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువు పై రియల్టర్ల కన్ను పడింది. కేవలం రెండు నెలల్లో చెరువుకు 4 సార్లు గండి కొట్టారంటే చెరువును ఎంత టార్గెట్​ చేశారో ? ఇట్టే అర్థం అవుతుంది. నిండుకుండలా మారిన సున్నం చెరువులో నీటి మట్టాన్ని తగ్గిస్తే వెనుక వైపు నుంచి సులువుగా కబ్జా చేసుకునే అవకాశం ఉంటుందని పదేపదే గండి కొడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు కబ్జాదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఖతర్నాక్​ ప్లాన్..

నిండు కుండలా ఉన్న సున్నం చెరువును ఎండగొడితే తప్ప తమ కబ్జాకు మార్గం సులువు అవుతుందని కబ్జాదారులు ఖతర్నాక్​ ప్లాన్ వేశారు. చెరువులో నీరు ఉండగా తమ కబ్జాలు అసాధ్యం అనుకున్నారో ఏమో ఏకంగా చెరువుకే ఏకంగా రెండు నెలల్లో 4సార్లు గండి కొట్టారు. వీరికి స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల అండ పుష్కలంగా ఉండటంతో కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే చెరువు చివరన కబ్జా..

ఇప్పటికే చెరువు చివరన కొందరు కబ్జాదారులు పెద్ద ఎత్తున స్థలాన్ని కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సున్నం చెరువు నిండుకుండలా మారింది. చెరువు స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న ఇండ్లలోను వరద నీరు భారీగా వచ్చి చేరింది. అప్పటికే చెరువు స్థలంలో నిర్మించిన ఇండ్లలో ఇంకా పూర్తిగా వరద నీరు నిలిచి ఉండగానే తమ కార్యకలాపాలకు అడ్డుగా ఉంటుందని ఏకంగా సున్నం చెరువుకు గండి కొట్టారు. చెరువు కట్టకు ఆనుకొని ఉన్న 2ఫీట్‌ల గ్రైనేట్ కట్టడాన్ని సైతం కబ్జాదారులు కూల్చివేశారు. దీంతో నిండుకుండలా ఉన్న సున్నం చెరువు కాస్త మళ్లీ అలుగు పారుతుంది. అప్పట్లో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో సంబంధిత అధికారులు గ్రానైట్ కట్టడాన్ని తిరిగి నిర్మించారు.

చెరువుపై మళ్లీ ప్రతాపం ..

మళ్లీ డిసెంబర్​1వ తేదీన తమ ఆక్రమణల కోసం నిండుకుండలా మారిన చెరువు పై మళ్లీ ప్రతాపాన్ని చూపెట్టారు. ఈ సారి మూడు ఫీట్ల దిగువకు ఒక రంధ్రాన్ని కొట్టి చెరువు నీరు బయటికి పోయేలా చేశారు. దీనిపై డిసెంబర్​ 5వ తేదీన 'దిశ' దినపత్రిక కబ్జా కోరల్లో సున్నం చెరువు అని ప్రత్యేక కథనం ప్రచురించింది. కథనానికి స్పందించిన అధికారులు ఆ రంధ్రాన్ని మూసివేశారు.

తిరిగి మళ్లీ రియల్టర్లు సున్నం చెరువు కట్టపై తాజాగా మరోసారి గ్రానైట్ తొలగించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే సున్నం చెరువు భూబకాసురుల వలకు చిక్కే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. చెరువు ఆనకట్ట వద్ద సీసీ కెమెరాలు నిర్మిస్తే కబ్జా రాయుళ్ల ఆటలు ఆరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed