వట్టినాగులపల్లిలో రియల్ మాఫియా

by Mahesh |
వట్టినాగులపల్లిలో రియల్ మాఫియా
X

దిశ‌, గండిపేట్: నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలో రియ‌ల్ మాఫియా పేట్రేగిపోతున్నది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స‌హ‌కారం అందిస్తుండ‌డంతో త‌మ‌ను ఎవ‌రూ ఆపుతారులే అన్న చందంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఆనుకొని ఉన్న భూములకు రెక్కలు రావడంతో అక్రమార్కుల చూపు ప్రభుత్వ భూముల వైపు మళ్ళింది. రెవెన్యూ అధికారుల అండదండలతో మాజీ వార్డు మెంబర్ సాగిస్తున్న అక్రమ దందాతో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఈ రియల్ మాఫియా కొల్లగొడుతుంది. 120 గజాలు రూ.30 లక్షలకు పైగా విక్రయాలు జరుపుతూ వందలాది లారీలతో రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని నింపుతూ జేసీబీలతో చదును చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్రజ‌ల నుంచి విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా స‌ర్వే నంబ‌ర్లు 130, 131ల‌లోని ప్రభుత్వ స్థలం గ‌ల్లంతు కావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శనం. స్థానికంగా ఓ మాజీ వార్డు స‌భ్యుడు వెనుకుండి ఇదంతా న‌డుపుతున్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూమిని అమ్మి..

రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండలం నార్సింగి మున్సిపాలిటీ వట్టినాగులపల్లి గ్రామంలో ఓ రియల్ మాఫియా ప్రభుత్వ భూమిని తెగనమ్మి సొమ్ము చేసుకుంటున్నది. సర్వే నంబర్లు 180లో 21 ఎకరం ఎనిమిది గుంటలు, 181/1, 181/2/2, 131/8, 181/2/1, 101/8/4 లలో 15 ఎకరాల నాలుగు గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సృష్టించారు. ఈ సర్వే నంబర్లలో గతంలో ఏ నిరుపేద కుటుంబానికి కేటాయించలేదని ఓ రెవెన్యూ అధికారి పేర్కొంటున్నారు. కొందరు స్థానిక ప్రజలు వ్యవసాయం వస్తుల స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు తెలిపారు. కాలక్రమేణ రైతులు, రియల్ మాపియాతో చేతులు కలిసి 120 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి, ఒక్కొక్క ప్లాటు రూ.30 లక్షలకు పైగా విక్రయాలు జరిపారు. ఈ ప్రాంతమంతా జీవో 111 అమ‌లులో ఉన్నప్పటికీ రియల్ మాపియా డోంట్ కేర్ అంటూ తమ సామ్రాజ్యాన్ని మూడు పువ్వులు ఆరు కాయాలుగా వర్ధిల్లుతుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతుందని ప్రజ‌లు ఆరోపిస్తున్నారు. రాత్రుళ్లు వందలాది లారీలతో మట్టిని నింపి జేసీబీలతో చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులకు ఎందుకు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ వార్డు మెంబర్ షాడోగా వ్యవహరిస్తూ అంతా తానై చక్రం తిప్పుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విప్రో ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉండటం, వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం జరుగుతుండడంతో ఎంత రేటు పెట్టైనా కొనేందుకు కొనుగోలు దారులు ఎగబడుతున్నారు. దీంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ కొన్ని షెడ్డులను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన దినసరి కార్మికులను పెట్టి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పరిస్థితులను బట్టి రూ.5 లక్షలు చొప్పున రెవెన్యూ సిబ్బందికి ముట్ట చెప్పడంతోనే ఇంత జరుగుతున్నా వారు స్పందించడం లేదని ఈ ప్రాంతంలో బహిరంగ చర్చ సాగుతున్నది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే రెవెన్యూ యంత్రాంగం కిమ్మనక పోవడంతో కలెక్టర్ స్పందించి రియల్ మాఫియా కబంధహస్తాల్లో చిక్కి కొట్టుమిట్టాడుతున్న భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కీల‌కంగా ప్రజా ప్రతినిధి, రెవెన్యూ అధికారులు..

గండిపేట్ మండ‌ల ప‌రిధిలో చేప‌డుతున్న క‌బ్జాల వెనుక ఓ మాజీ ప్రజా ప్రతినిధి, అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే స‌ద‌రు అక్రమార్కులు చేస్తున్న ప‌నుల‌కు ఎలాంటి అడ్డు చెప్పడం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అక్రమార్కుల‌కు బుద్ధి చెప్పకుండా చోద్యం చూస్తున్నార‌ని, ఇది స‌రైంది కాద‌ని ప్రజ‌లు కోరుతున్నప్పటికీ అధికారులు మాత్రం మౌనం వీడ‌డం లేదు. అంతేకాకుండా అధికారుల‌కు అందిన ముడుపుల కోసం మౌనంగా ఉంటున్నార‌ని ఆరోపిస్తున్నారు. ముడుపుల కోసం భూముల‌ను అన్యాక్రాంతం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు స్పందించి చ‌ర్యలు తీసుకొని స‌ద‌రు భూమిని కాపాడాల‌ని ప్రజలు కోరుతున్నారు.Next Story

Most Viewed