మునుగోడు ఎన్నికలకు రంగారెడ్డి అడ్డా

by Disha Web Desk 20 |
మునుగోడు ఎన్నికలకు రంగారెడ్డి అడ్డా
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ కూర్చున్న మునుగోడు ఉపఎన్నికలపైనే చర్చ సాగుతుంది. అయితే ఈ ఎన్నిక కేవలం మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసమా... అభివృద్ధి కోసమా... వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసమా అంటే ఏ పార్టీల వాదన వారిదే. కానీ ఓటర్లను ఏవిధంగా తమవైపు తిప్పుకోవాలని ఆయా పార్టీల నేతలు పూర్తి స్ధాయిలో నిమగ్నమైయ్యారు.

అందుకోసం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలు ఉండటంతో కేవలం ప్రచార సరళికి మాత్రమే పరిమితమైతున్నారు. అదే విధంగా ఆ ఓటర్లను ప్రభావితం చేసేందుకు స్ధానికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పక్కనే ఉన్న రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో క్యాంపులు, సమావేశాలు, సభలు పెట్టి ఆయా పార్టీల నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలా ఏదీ ఏమైనా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరగుతుంటే, ప్రస్తుతం పార్టీలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలతో రంగారెడ్డి జిల్లాలోనే ఎన్నికలున్నట్లు హడావుడి జరుగుతుంది.

ఈ నేతలే మునుగోడులో ఎన్నికల ఇంచార్జీలు...

మునుగోడులో జరిగే ఉపఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా నేతలు ప్రతి మండలంలోని ఒక ప్రాంతానికి ప్రచార సారథులుగా పనిచేస్తున్నారు. అయితే ఆయా పార్టీల అధినేతలు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీలీడ్​ చూపించాలని ఆదేశించడంతో టార్గెట్​గా ప్రతి పార్టీ నాయకుడు పనిచేస్తున్నారు. అంతేకాకుండా టీఆర్​ఎస్​, బీజేపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్​, బీజేపీలల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నేతలే మునుగోడు ఉపఎన్నికల్లో గ్రామాలు, మండలాల వారీగా ఇంచార్జీ బాధ్యతలు తీసుకొని ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఎల్బీనగర్​, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఉప్పల్​ నియోజకవర్గంలో నివాసముంటున్న మునుగోడు ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, టీఆర్​ఎస్​ పార్టీలు సమావేశాలు, సభలు పెడుతున్నారు. ఈ సమావేశం ఆత్మీయుల సమావేశమని పెట్టి విందు, మందుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఏలాగైనా తమకు అప్పగించిన ప్రాంతంలో అత్యధికంగా ఓటింగ్​ తమ పార్టీకి పడేలా శథవిధాల ప్రయత్నం చేస్తున్నారు.

సంఘాల పేరిట ప్రచారం...

మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లను కులాలు, మతాలు, వివిధ కార్మిక సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు నగర శివారులోని ఫంక్షన్​ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్​ఎస్​, బీజేపీ నాయకులు కొన్ని ఫంక్షన్​ హాల్స్​ను నవంబర్​ 2వ తేదీ వరకు బుకింగ్​ చేసుకొని హైదరాబాద్​లో ఉండే పార్టీ అధినేతలకు అందుబాటులో ఉండేవిధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఓటరు నగదు పంపిణీ కూడా ఇక్కడ నుంచే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీతో సంబంధం లేకుండా హైదరాబాద్​లో ఉండే ఓటర్లు సభలు, సమావేశాలకు, ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో నివాసముండే వివిధ పార్టీల నేతలు సైతం నగర సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఊర్లో ఒక పార్టీ తరుపున ప్రచారం, నగరంలో సాయంత్రం నిర్వహించే మరో పార్టీ విందులో పాల్గొని నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు.

Next Story