'దళితబంధు' అమలు.. ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించిన మంత్రి

by Web Desk |
దళితబంధు అమలు.. ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించిన మంత్రి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేశారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి శనివారం ఆమె కార్యాలయం నుంచి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దళితబంధు పథకంతో దళితుల్లో ఆర్థిక అభివృద్ధి జరగాలని సీఎం కేసీఆర్ ఆశిస్తున్నారని వివరించారు. మొదటి విడుతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది అర్హులను గుర్తించి బ్యాంక్ ఖాతాలను తీయాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకం సక్రమంగా అమలు అయ్యేలా పనిచేయాలని సూచించారు. ఈ నెలఖరి వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు.

దీనికి సంబంధించి గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కులపెద్దతో పాటు ఒక రిసోర్స్ పర్సన్‌ను కూడా నియమించడం జరుగుతుందని ఆమె అన్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తాసీల్దార్‌తో పాటు ఒక రిసోర్స్ పర్సన్‌ను అధికారిగా నియమించడం జరుగుతుందని మంత్రి అన్నారు. దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి అన్నారు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ కింద రూ.10 లక్షలతో ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నేరుగా లబ్దిదారుని అకౌంట్‌‌లో తిరిగి చెల్లించే భారం లేకుండా పూర్తి గ్రాంటు రూపంలో అందజేస్తుందన్నారు. దీనితో లబ్దిదారునికి వాయిదాల ఆందోళన ఉండదన్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతో పాటు మొదటి విడతలో 100 మంది చొప్పున 400 మందిని అధికారులు పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు.

ఈ నెలాఖరు లోపు జాబితా ఇవ్వాలని, ఫిబ్రవరి 5వ తేదీ నుండి మంజూరు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. వికారాబాద్ జిల్లాలో 54,358 దళిత కుటుంబాలు ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కలు వచ్చాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 39 వేల 749 కుటుంబాలు గుర్తించినట్లు, కానీ. కుటుంబ సమగ్ర సర్వేను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు అమోయ్​ కుమార్, నిఖిలలతో పాటు ఎంపీ రంజిత్​ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్​రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed