వనస్థలిపురం పై కాలుష్య కుంపటి.. ప్రైవేటు వ్యక్తి ధన దాహానికి ప్రజలు బలి

by Disha Web Desk 12 |
వనస్థలిపురం పై కాలుష్య కుంపటి.. ప్రైవేటు వ్యక్తి ధన దాహానికి ప్రజలు బలి
X

దిశ, వనస్థలిపురం: కాలుష్య కుంపటితో వనస్థలిపురం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రపంచంలోనే కాలుష్య నివారణలో హైదరాబాద్ నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మరో కాలుష్య కుంపటిగా మారినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఓ వ్యక్తి ధన దాహానికి స్థానికులు బలవుతున్నారు. ఒక పెద్ద ఇసుక అడ్డాను తరలించడానికి అటు ప్రజాప్రతినిధులు ఇటు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ఫలితంగా దీని చుట్టుపక్కల కాలనీలో నివసిస్తున్న ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు గత 20 ఏళ్తుగా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి 65 వనస్థలిపురం ఆటోనగర్ వద్ద దాదాపు 20 ఎకరాల్లో రోజు సుమారు 2వేల లారీలు ఇసుకను ఇక్కడికి తరలిస్తున్నాయి.

రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇసుకను ఇక్కడికి తరలించి ఇక్కడ నుంచి ఇసుకను స్థానిక లారీల ద్వారా స్థానిక ఇండ్ల, భారీ నిర్మాణాల పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వద్దకు తరలిస్తున్నారు. నిత్యం 2వేల నుంచి 3వేల లారీలు ఈ ప్రక్రియలో ఉంటాయి. దాదాపు ఇసుక అడ్డ మీద 2వేల పైగా లారీలు నిరంతరం ఉండడం వల్ల ఇక్కడ ప్రజలకు ఇసుకతో వాయు కాలుష్యంతో ఇతర దుమ్ము దూళీతో చుట్టుపక్కల కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులకు కూడా గురవుతున్నారు. మరియు ఈ జాతీయ రహదారిపై ఇసుక లారీలు వెళ్తుండటంతో ఇసుక రోడుపై పడటంతో తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఎన్నికలప్పుడే హడావుడి..

ఎన్నికలు వస్తే చాలు తాము ఇసుక అడ్డాను తరలిస్తామని గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీలో సామ ప్రభాకర్ రెడ్డి మొదలు సామ తిరుమల్ రెడ్డి ప్రస్తుతం నవజీవన్ రెడ్డి వరకు ఇసుక అడ్డా తరలింపు మీద ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పారు తప్ప వీళ్ళు తరలింపునకు ఏమాత్రం చొరవ చూపడం లేదు.గతంలోనైతే అధికార పార్టీలో సామ తిరుమల్ అల్రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు లారీకి అడ్డంగా పడుకొని ఇసుక అడ్డను తరలించకపోతే ఊరుకోమని హెచ్చరించారు.

కానీ తర్వాత ఏం జరిగిందేమో గాని ఈ అడ్డా తరలింపుపై ఒక్క మాట కూడా కౌన్సిల్లో మాట్లాడలేదు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి కూడా దీని మీద పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తుంది. గతంలో 2009 నుండి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంతో చెప్తే సీఎం అంత వింటాడు. తను చేయడం వల్ల ఆటో నగర్ డంపింగ్ యార్డ్ తరలిపోయిందని ప్రతి ఉపన్యాసంలో చెప్పే సుధీర్ రెడ్డి ఈ విషయంలో మాత్రం పూర్తిగా సైలెంట్ గా వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా ఉంటున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా జాతీయ రహదారికి అవతలి వైపున ఉన్న పార్కు జాతీయ హరిణ వనస్థలి పార్క్ పరిధిలో ఈ ఆటోనగర్ ఇసుక అడ్డా ఉండడం వల్ల ఈ పార్క్‌లోనే జీవులకు వాటి సంరక్షణకు అనేక రకమైన అడ్డంకులు కలుగుతున్నాయి. ఈ విషయంపై స్థానిక ఫారెస్ట్ అధికారులు కూడా ఏ రోజు ఈ అడ్డాకు వ్యతిరేకంగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు రాసినట్లు లేదు. ఒకవైపు ప్రజలు కాలుష్యం ఎదుర్కొంటూ మరోవైపు ఈ జాతీయ హరిణ వనస్థలి పార్క్ ప్రాణులకు ప్రాణ సంకటంగా మారినా ఇసుక అడ్డా తరలింపును ఎవరు పట్టించుకోవడం లేదు. కేవలం కమిషనర్లకు, ప్రజాప్రతినిధులు కాసులకు భూ యజమాని కాంట్రాక్టర్లు కక్కుర్తి పడడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కాలనీ సంక్షేమ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజ్ఞప్తులు.. బుట్టదాఖలు

కాలుష్య సమస్యలపై స్థానిక కాలనీ సంఘాల నాయకులు చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. చాలాసార్లు ప్రజాప్రతినిధులను కూడా తరలించాలని విన్నవించుకున్నారు. కానీ ఫలితం శూన్యం. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం డివిజన్ పరిధిలో పరిధిలోని హరిణ వనస్థలి ఎదురుగా 20 ఎకరాల్లో ఈ అడ్డా కొనసాగుతుంది. ఈ ఖాళీ స్థల యజమానికి రాజకీయంగా పలుకుబడి ఉంది. దీంతో సదరు వ్యక్తి మరొకరికి కాంట్రాక్ట్ ఇచ్చి అతని వద్ద నెలనెలా అద్దె వసూలు చేస్తున్నారు. అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు నెల నెల వసూలు చేస్తున్న భూ యజమాని ఒకవైపు కాంట్రాక్టు ఇసుక లారీలను దోషులు చేస్తున్న మరోవైపు ఇద్దరి దోపిడీకి స్థానిక ప్రజలు బలవుతున్నారు.

కాలుష్యంతో సతమతం

అరుణోదయ నగర్, భాగ్యలత కాలనీ, బీడీఎల్ కాలనీ, ద్వారకమయి నగర్, హైకోర్టు కాలనీ, హుడా సాయి నగర్ కాలనీ శారద నగర్ కాలనీ కూడా సాయి నగర్ కాలనీ, ఆటో నగర్ కాలనీ, భూలక్ష్మి నగర్ కాలనీ, ఆటో సాయి నగర్ కాలనీ, సుభద్ర నగర్ కాలనీ కమలానగర్‌లు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. కాలుష్యం కారణంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

Next Story

Most Viewed