సమస్యల విన్నపానికి జిల్లాకు వెళ్ళవలసిందేనా

by Disha Web Desk 20 |
సమస్యల విన్నపానికి జిల్లాకు వెళ్ళవలసిందేనా
X

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మండల కేంద్రంలో ఫిర్యాదులు చేపట్టడానికి నెలలో ఒక రోజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకటించింది. కానీ కరోనా మహమ్మారి పేరుతో ఆ ఉత్తర్వులు అటకెక్కయి. కరోనా విజృంభించక ముందు మండల కేంద్రాల్లో ప్రతినెల మొదటి సోమవారం ప్రజావాణి పేరుతో మండలస్థాయి ఫిర్యాదులను అధికార యంత్రాంగం తహసిల్దార్ కార్యాలయంలో స్వచ్ఛందంగా స్వీకరించేవారు. గ్రామాల్లోని సన్న చిన్న కారు రైతులు, కూలి, నాలి చేసుకొని పొట్ట గడవని నిరుపేదలు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే జిల్లా కేంద్రంలో ప్రజావాణికి వెళ్లి సమస్యలను విన్నవించుకోవాల్సిందేనా అని గ్రామీణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

నేరుగా కలెక్టర్ దృష్టికి వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రాల్లో ఉండే అధికారులు ఎందుకు ఉన్నట్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల కొంగర కలాన్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. కొత్త కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాలంటే వాహనాలు సక్రమంగా లేవని సుమారు నాలుగు, ఐదు కిలోమీటర్లు కాలినడక తప్పదని సామాన్య ప్రజలు ఆవేదన గురవుతున్నారు. లేకుంటే ద్విచక్ర వాహనాలు లేదా కారును తీసుకొని వెళ్లవలసిందే అని వాపోతున్నారు. స్థానికంగా పరిష్కారమయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు. పెద్ద సమస్యలు ఉంటేనే జిల్లా కేంద్రానికి వెళ్లే విధంగా చూడాలని అంటున్నారు.

ప్రతి చిన్న సమస్యకు జిల్లా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే, ఒకరోజు మొత్తం వృధా అవుతుందని అంటున్నారు. స్థానికంగా ఉండే మరో నేత సహకారం తీసుకొని జిల్లా కేంద్రానికి వెళ్లవలసిన పరిస్థితి దాపురించిందని బాధితులు వాపోతున్నారు. కలెక్టర్ అమాయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజాసమస్యల పరిష్కారంకోసం జిల్లావ్యాప్తంగా ఒక వాట్సాప్ ను వేదికగా తీసుకొస్తే పేద ప్రజలకు ఎంతో న్యాయంచేసినవారు అవుతారని పేదప్రజలు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ ఇప్పటికైనా చొరవ తీసుకొని మౌలిక సమస్యలను స్థానికంగా పరిష్కరించే విధంగా చూడాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed