మోడీపైనే ప్రజలందరికీ విశ్వాసం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
మోడీపైనే ప్రజలందరికీ విశ్వాసం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, గండిపేట్:- దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీపై అనంతమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని కోకాపేటలో నిర్వహించిన రాజ పుష్ప అట్రియా గేటెడ్ కమ్యూనిటీస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ, అభివృద్ధి విషయంలో దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీపై అనంతమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయన్నారు.

ఆ నమ్మకం విశ్వాసమే ఆయనను మూడోసారి ప్రధానమంత్రి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంతో జీవించడానికి నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశంలోని వేలాది గ్రామాల్లో మరుగు దొడ్ల నిర్మాణం జరిగిందని, ప్రజలంతా గౌరవంగా జీవిస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకులో ఏకీకరణ, జన్ ధన్ యోజన వంటి పథకాల ద్వారా సామాన్య ప్రజలను ఆర్థిక అభివృద్ధిలో భాగం చేశారన్నారు.

మోడీ అనుసరించిన ఆర్థిక విధానాలతో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఒకప్పుడు పీకల్లోతు నష్టాల్లో మునిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ వేలాది కోట్ల రూపాయల లాభంతో నడుస్తున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. సామాన్యులు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి మోడీ ముందు చూపు మార్గదర్శకత కారణమన్నారు. ఇవాళ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడానికి మోడీ చేసిన కృషి ఎంతో ఉందని అన్నారు.

క్లారిటీ లేని కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంతాల వైరుధ్యాలు ఉన్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కామన్ సివిల్ కోడ్, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాక్, కాశ్మీర్ విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. చివరికి లిక్కర్ స్కాం కేసులోనూ కాంగ్రెస్ అధిష్టానం ఒకలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మరోలా ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని ఆయన ఆరోపించారు.

దేశంలోని మతాలను కులాలను ప్రజలను ఒకే భావంతో చూస్తున్నా ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని ఆయన చెప్పారు. సమాజ సేవకే రాజకీయాల్లోకి సమాజంలోని అంతరాలను చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకున్న తాను రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యాను అన్నారు. తాను తొలిసారిగా లోక్ సభకు ఎన్నికైన సమయంలో సుమారు వందకు పైగా లోక్ సభలో ఉపన్యాసాలు ఇచ్చానన్నారు.

200 సార్లకు పైగా పార్లమెంట్ లోని వివిధ కమిటీల ముందు తన అభిప్రాయాలను విస్పష్టంగా ప్రకటించినట్లు తెలిపారు. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తన మరోసారి చేవెళ్ల ప్రజలంతా ఆశీర్వదించి లోక్ సభకు పంపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ఆదిత్య రెడ్డి, పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రదీప్, గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ సురేష్, మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed