శ్రీరామనవమి వేడుకల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజాసింగ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు?

by Disha Web Desk 2 |
శ్రీరామనవమి వేడుకల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజాసింగ్‌పై చర్యలకు సిద్ధమైన పోలీసులు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని రాజాసింగ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పీచ్‌ను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రసంగాల వీడియోలను న్యాయనిపుణులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు పంపి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వారిచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయన ప్రసంగంలో చట్టానికి విరుద్ధంగా వ్యాఖ్యలు ఉంటే రాజాసింగ్‌పై చర్యలు ఉంటాయని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే శుక్రవారం వెల్లడించారు. గురువారం జరిగిన శోభాయాత్రలో హాట్ కామెంట్స్ చేశారు. గతంలో పీడీ యాక్ట్ కేసు కింద అరెస్ట్ అయిన రాజాసింగ్ షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నారు.

విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయవద్దని కోర్టు షరతులు విధించింది. అయినప్పటికీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టప్రకారం రాజాసింగ్ పై చర్యలు తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసే విషయంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. రాష్ట్ర నాయకత్వం సైతం అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బహిరంగ పరచలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాజాసింగ్ పరిస్థితి ఏంటి అనేది ఆయన అభిమానులు, అనుచరుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తనకు పార్టీ అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని లేకుండా పోటీకి దూరంగా ఉంటానే తప్ప మరో పార్టీలో చేరేది లేదని రాజాసింగ్ గతంలోనే స్పష్టం చేశారు.



Next Story

Most Viewed