ప్రశ్నపత్రాలు లీక్ .. TSPSC బోర్డు ఎమర్జెన్సీ మీటింగ్

by Disha Web Desk 2 |
ప్రశ్నపత్రాలు లీక్ .. TSPSC బోర్డు ఎమర్జెన్సీ మీటింగ్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఏఈ సివిల్, జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు పోలీస్ విచారణలో వెల్లడైన నేపథ్యంలో టీఎస్పీసీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించింది. ఈ రెండు పరీక్షలను రద్దు చెయ్యాలా? లేక ఎవరికైతే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయో వారి ఫలితాలను నిలుపుదల చెయ్యాలా? అన్నది సమావేశంలో నిర్ణయించనున్నారు. టీఎస్పీసీ ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇటీవల లీక్ అయిన విషయం తెలిసిందే. దీనిపై బోర్డు వర్గాలు చేసిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో బోర్డు ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ కూడా ఉన్నారు. వీరిని జరిపిన విచారణలో ఈనెల 5న జరిగిన సివిల్, జనరల్ స్టడీస్ పరీక్షల ప్రశ్నపత్రాలను 5 లక్షలు తీసుకొని రేణుకకు ఇచ్చినట్టు వెళ్లడయ్యింది. వీటిని మరో నిందితుడు దాక్యా నాయక్ తన బామ్మర్ది రాజశేఖర్ నాయక్‌కు ఇచ్చినట్టు తేలింది. రాజశేఖర్ నాయక్ 13.50 లక్షలు తీసుకొని వీటిని నితేష్ నాయక్, గోపాల్ నాయక్‌లకు అమ్మినట్టు వెళ్లడయ్యింది. ఈ ఇద్దరు పరీక్ష రాసినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే సివిల్, జనరల్ స్టడీస్ పరీక్షలను రద్దు చెయ్యాలా? లేక లీక్ అయిన ప్రశ్నపత్రాలతో ఎగ్జామ్ రాసినవారి ఫలితాలను ఆపాలా? అన్నదానిని నిర్ణయించేందుకు బోర్డు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. న్యాయ నిపుణులతో చర్చించి ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాలని, ఆ తరువాతే నిర్ణయం తీసుకోవాలని బోర్డు అధికారులు నిశ్చయించారు. కాగా, ఈ పరిణామాలు నిజాయితీగా పరీక్షలు రాసిన వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.



Next Story