వర్సిటీల్లో ప్రమాణాలు కరువు.. తెలంగాణలో 16 వర్సిటీలకు న్యాక్ గుర్తింపు లేదు

by Dishafeatures2 |
వర్సిటీల్లో ప్రమాణాలు కరువు.. తెలంగాణలో 16 వర్సిటీలకు న్యాక్ గుర్తింపు లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్ లో వెలుగులు నింపాల్సిన వర్సిటీలు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో మగ్గిపోతోంది. ఇప్పటికే పలు వర్సిటీల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొందరు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులను చూసైనా గుణపాఠం నేర్చుకుని నాణ్యతా ప్రమాణలు మెరుగు పరుచుకోవాల్సిన బాధ్యత ఆయా వర్సిటీలపై ఉంది. కానీ అవి నేటికీ ఎలాంటి చలనం లేకుండా ఉన్నాయి. ఎవరెటు పోతే తమకేంటనే ధోరణిలో ఉన్నాయి. ఇందుకు విద్యా ప్రమాణాలు పొందని వర్సిటీలు, కాలేజీల జాబితానే నిదర్శనంగా మారింది. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదికలో ఇది తేటతెల్లమైంది.

తెలంగాణలో మొత్తం 31 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో కేవలం సగం వర్సిటీలు మాత్రమే నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపును పొందాయి. మరో 16 యూనివర్సిటీలు న్యాక్ గుర్తింపు పొందాల్సి ఉంది. కానీ వాటికి ఇప్పటి వరకు ఆ గుర్తింపు దక్కలేదు. అలాగే కాలేజీల వారీగీ చూసుకున్నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణలోని మొత్తం కాలేజీల సంఖ్య 2062 ఉండగా, ఇందులో కేవలం 286 ఉన్నత విద్యా కాలేజీలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉంది. 1776 కాలేజీలకు న్యాక్ గుర్తింపు కరువైంది. దీన్ని అధిగమించేందుకు ఆయా వర్సిటీలు, కాలేజీలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనేది మాత్రం చూడాల్సి ఉంది.

వర్సిటీలు, కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఆ గుర్తింపు ఆధారంగానే వర్సిటీ, కాలేజీ స్టాండర్డ్ ఏంటనేది చెప్పొచ్చు. అలాంటిది 16 వర్సిటీలు, 1776 కాలేజీలకు గుర్తింపు లేకపోవడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. 1.50 సీజీపీఏకు సమానంగా లేదా అంతకంటే తక్కువ గ్రేడ్ సాధించిన వర్సిటీలు, కాలేజీలుగా న్యాక్ గుర్తింపు పొందనివిగా చెప్పుకోవచ్చు. ఇది ‘డీ’ గ్రేడ్ గా పరిగణించబడుతున్నాయి. 1.51 సీజీపీఏ పొంది 4 సీజీపీఏకు పైగా గ్రేడ్ ఉంటే న్యాక్ గుర్తింపు పొందిన వర్సిటీలు, కాలేజీల జాబితాలో ఉన్నట్లు. దీన్నిబట్టి చూసుకుంటే ఆయా కాలేజీలు, వర్సిటీలు ఎంతటి దుస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీలు, కాలేజీల తీరు అలా ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మిగలనుంది. ఇకనైనా ఆయా వర్సిటీలు, కాలేజీలు ప్రమాణాలు మెరుగుపరుచుకుంటే విద్యార్థుల భవిష్యత్ అంధకారం నుంచి వెలుగులోకి వచ్చే అవకాశముంది.


Next Story

Most Viewed