జాతీయ నేతలపైనే బీజేపీ ఆశలన్నీ

by Disha Web Desk 12 |
జాతీయ నేతలపైనే బీజేపీ ఆశలన్నీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ జాతీయ నేతలంతా రంగంలోకి దిగబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలంటే జాతీయ నేతల ఎంట్రీ తప్పనిసరి అయింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం జాతీయ నేతలపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. వారు వస్తే కానీ ఒక ఊపు రాదనే భావనలో ఉన్నారు. త్వరలోనే పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులు తెలంగాణకు రాబోతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై దండయాత్ర చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 10వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా ఈనెల 27వ తేదీన మరోసారి ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.

ఆ రోజు కుత్బుల్లాపూర్‌లో కానీ లేదా రాజేంద్ర నగర్ లో కానీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈనెల 20, 21 తేదీల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ తెలంగాణలో రెండు రోజులు పర్యటించనున్నారు. అయితే ఆయన ఎక్కడ బహిరంగ సభలకు హాజరవుతారన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దీంతో పాటు ప్రధాని మోడీ, నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటనలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రధాని ఒక్క రోజు వ్యవధిలో రెండుమార్లు పర్యటించారు. ఆయన స్పీచ్ బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. కాగా ఆయన పర్యటనలు ఇంకా కొనసాగుతాయని ప్రచారం జరగడం పై నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు.

Next Story