T-టీడీపీ అధ్యక్ష పదవిపై కన్ను.. సొంతగూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి..!

by Rajesh |
T-టీడీపీ అధ్యక్ష పదవిపై కన్ను.. సొంతగూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి..!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : తెలుగు దేశం పార్టీ రమ్మంటోంది...తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానంటున్నారు..? పోతే ఏలా ఉంటుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు వద్దనడంతో తిరిగి సొంతగూటికి చేరే ఆలోచనలతో మల్లారెడ్డి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సొంత ఆస్తులను కాపాడుకోవడంతో పాటు రాజకీయంగా అధిపత్యాన్ని కాపాడుకునేందుకు మల్లారెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తన అనుచర గణం పేర్కొంటుంది.

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. దానికి తోడు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం కావడం..పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతోనే ఉండడంతో తనకు అన్ని రకాలుగా కలిసి వస్తోందని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి అండతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి, తన విద్యా సంస్థలపై దాడులను అరికట్టాలని, కేంద్రంలో తన పనులను చక్క బెట్టుకోవాలని చూస్తున్నట్లు మల్లారెడ్డి సన్నిహితులే పేర్కొంటున్నారు.

టీడీపీ నుంచే పొలిటికల్ ఎంట్రీ..

చామకూర మల్లారెడ్డి టీడీపీ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 లో తెలుగు దేశం పార్టీ తరపున మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం.. పార్టీ చతికిల పడడంతో మల్లారెడ్డి 2016 లో కారెక్కారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ మంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కొల్పోవడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి.

తన విద్యా సంస్థలు, అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం దూకుడు పెంచింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు, కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతోనూ మంతనాలు జరిపినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కాషాయ పార్టీ పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు తెలిసింది. దీంతో రెండు జాతీయ పార్టీల ద్వారాలు మూసుకుపోవడంతో టీడీపీలో చేరాలని తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

అధ్యక్ష పదవిపై నజర్..

తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో మల్లారెడ్డి ఈ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నందున అధ్యక్ష పదవిని పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లుతున్నట్లు తన అనుకూల సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దాన్ని మల్లారెడ్డి అధికారికంగా ఖండించకపోవడం కూడా గమనార్హం. ఒకవేళ మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించకపోతే పత్రిక ముఖంగా కానీ, సోషల్ మీడియా వేదికగా కానీ ఖండించేవారని పోలిటీకల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

Read More : AP Politics: పొత్తు ధర్మానికి ‘టీ’ బ్రేక్



Next Story