AP Politics: పొత్తు ధర్మానికి ‘టీ’ బ్రేక్

by Indraja |
AP Politics: పొత్తు ధర్మానికి ‘టీ’ బ్రేక్
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: ‘టీ టైం’ అధినేత తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, టీడీపీ పిఠాపురం ఇన్‌చార్జి ఎస్వీఎస్ వర్మల మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందే నెలకొన్న విభేదాలు ఎన్నికలు పూర్తయిన అనంతరం ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. తంగెళ్ళ శ్రీనివాస్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఇన్‌చార్జి‌గా ప్రకటించిన వెంటనే శ్రీనివాస్ పిఠాపురంలో తన ఆధిపత్యాన్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన సమన్వయ సమా వేశంలో తంగెళ్ల అనుచరులు పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీనివాస్ పోటీ చేస్తారనే నినాదాలు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. అప్పటివరకు పిఠాపురం నుంచి వర్మ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పాటై ఎన్నికల బరిలో నిలిచాయి.

విభేదాలకు కేరాఫ్‌గా తంగెళ్ల..

కాగా ప్రస్తుతం పిఠాపురంలో నెలకొన్న విభేదాలకు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కేంద్ర బిందువుగా మారారు. టీడీపీ బహిష్కృత నేతలను జనసేనలోకి చేర్చుకోవటం ద్వారా తాను అనుకున్న పనిని సాధించాలనుకున్నారో ఏమో కానీ అలా జనసేనలోకి వచ్చిన వారే ఇటీవల వన్నెపూడిలో వర్మపై దాడులకు తెగబడ్డారు.

అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా వర్మ సంయమనం పాటిస్తూ అసలైన జనసైనికులతో తమకు విభేదాలు లేవని, దాడి చేసినవారు శ్రీనివాస్ అనుచరులేనని తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే తాటిపర్తిలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య అన్నపూర్ణాదేవి ఆలయ కమిటీ అంశంపై రచ్చ రేగింది. అప్పటివరకు ఆలయ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు ఆలయ కమిటీ తాళాలు, నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు జనసేనలో చేరిన వైసీపీ నాయకులకు అందించడంతో వివాదం మొదలైంది. దీనిపై టీడీపీ వర్గాలు తమ నిరసన తెలిపాయి. వలస వచ్చిన వారితోనే తమకు సమస్యగా వర్మ ప్రకటించారు.

పొత్తు ధర్మానికి విరుద్ధంగా జనసేన..

పిఠాపురంలో ఇటీవల జరుగుతున్న అల్లర్లు, పరిణామాలు పరిశీలిస్తే పొత్తు ధర్మానికి విరుద్ధంగా జనసేన వెళుతున్నట్లు దోహదపడుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన వెంటనే పోటీ చేయాలని ఆశించిన వర్మ కాస్త వెనక్కి తగ్గి పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవకపోతే తన యావదాస్తి పందెంగా పెట్టడం చూస్తే వర్మ పట్టుదల, పొత్తు ధర్మంపై ఆయనకున్న నిబద్ధత తెలియజేస్తోంది.

అయితే ప్రస్తుతం జనసేన, టీడీపీ వర్గాల మధ్య రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా పడే ప్రమాదం ఉంది. శ్రీనివాస్‌కు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఉన్న విభేదాలను కాకినాడ ఎంపీ అవకాశంగా తీసుకొని వర్మను సాధించాలనే లక్ష్యంగా వైసీపీ నుంచి వచ్చే వలస నేతలను జనసేనలోకి ఆహ్వానించి వారి ద్వారా రచ్చ చేయాలనుకుంటే అది ఆయనకే ఎదురు తిరిగే పరిస్థితి నెలకొంది.

దోషులుగా తేలితే కఠిన చర్యలు : నాగబాబు

ఈ పరిణామాలపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందిస్తూ ఈ రెండు సంఘటనలపై దర్యాప్తు నిర్వహిస్తామని అందులో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ళ వైఖరి మార్చుకోకపోతే పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గం ఎమ్మెల్యేలు అయనకు సహకరించకపోవచ్చు.

ఇప్పటికే శ్రీనివాస్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, దుబాయిలో బెట్టింగులు నిర్వహించే వారనే అరోపణలు ఎన్నికల సమయంలో వినిపించాయి.

Read More : T-టీడీపీ అధ్యక్ష పదవిపై కన్ను.. సొంతగూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి..!



Next Story

Most Viewed