40 మంది విద్యార్థులకు పాజిటివ్.. పేరెంట్స్‌లో టెన్షన్.. టెన్షన్

by Disha Web Desk 4 |
40 మంది విద్యార్థులకు పాజిటివ్.. పేరెంట్స్‌లో టెన్షన్.. టెన్షన్
X

దిశ ప్రతినిధి, మహబూబాబాద్: కరోనా మహ్మమారి మాయమైందని ఉపిరి పీల్చుకుంటున్న జనాలు పెరుగుతున్న కేసులను చూసి కలవరపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, గార్ల, గూడూరు మండలాల్లోని గురుకుల పాఠశాల విద్యార్థులకు రాపిడ్ పరీక్షలలో పాజిటివ్ కేసులు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు, గురుకులాలకు వేసవి సెలవులు ప్రకటన దగ్గరల్లో ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో జిల్లా విద్యాధికారులు సైతం పరేషాన్ అవుతున్నారు. మహబూబాబాద్ గిరిజన బాలుర గురుకులంలో 16 మందికి, గూడూరు గురుకులంలో ఐదుగురికి, గార్ల బంజారా సేవా సమితి పాఠశాలలో 18 మందికి వైద్యాధికారులు రాపిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారించారు. బాధిత విద్యార్థులను ఆయా గురుకులంలోనే ఐసోలేషన్‌లో ఉంచారు.

థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయకపోవడంతోనే..

గురుకులాలు, పాఠశాలల్లో విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయకపోవడంతోనే విద్యార్థుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శానిటేషన్, కరోనా రూల్స్ పాటిచకపోవడంతోనే విద్యార్థులకు కరోనా వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా నిబంధనలు నిల్..

నిబంధనలను, ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసినప్పటికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం లాంటి నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించింది. కానీ జిల్లాలో కరోనా రూల్స్ పాటించడం లేదు. దీంతో జిల్లా కరోనా విజృంభన రోజురోజుకూ పెరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా వైద్యాశాఖ విఫలం..

కరోనా నియంత్రణలో జిల్లా వైద్యాధికారులు పూర్తిగా విఫలమైనట్లు ప్రజలు మండిపడుతున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ కేంద్రాలు ఎత్తి వేయడంతో అనుమానితులు పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి...

జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తెలపండి. వెంటనే స్థానిక వైద్యులు, ఆరోగ్య కేంద్రాలకు సమాచారం ఇవ్వండి. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో అదనపు బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా సోకిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

‌‌–జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్

Next Story