టెన్త్ పేపర్ ఔట్‌తో వేడెక్కిన రాజకీయం.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన వ్యవహారం

by Disha Web Desk 6 |
టెన్త్ పేపర్ ఔట్‌తో వేడెక్కిన రాజకీయం.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన వ్యవహారం
X

టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పుడు మళ్లీ వరుసగా టెన్త్ పేపర్స్ ఔట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి. టెన్త్ పేపర్స్ లీక్ లో కుట్ర చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు ఈ వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండటంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూకుడు పెంచాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి, పై చేయి సాధించాలని చూస్తున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మంత్రులు కేటీఆర్, సబితా రాజీనామాలకు డిమాండ్ చేశాయి. ఈ కేసును సిట్ విచారిస్తుండగా, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్ లో నిందితుడు రాజశేఖర్ కు బీజేపీతో సంబంధముందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్నది. ఈ కేసు విచారణ జరుగుతున్న తరుణంలోనే టెన్త్ తెలుగు, హిందీ పేపర్స్ ఔట్ అయ్యాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అయితే తెలుగు పేపర్ ఔట్ లో ఉపాధ్యాయులపై ప్రభుత్వం వేటు వేసింది. ఇందులో బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తపస్ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా, హిందీ పేపర్ ఔట్ అయింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించాయి. అయితే ఇందులో ప్రశాంత్ ప్రధాన నిందితుడు అని పోలీసులు తేల్చారు. సూత్రధారిగా బండిసంజయ్ ను పేర్కొంటూ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నిరసనలు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను విమర్శిస్తున్నారు. బీజేపీ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టారు.

మైలేజ్ పొందే యత్నాలు

రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను సీబీఐ, ఈడీ అధికారులు విచారించారు. అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేయిస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మైలేజ్ పొందాలని యత్నించింది.

ఆ తర్వాత టీఎస్పీఎస్, టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కు మీరంటే మీరు కారణమని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు ప్రతి విమర్శలకు తెరలేపారు. ప్రజల్లో సానుభూతి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. టెన్త్ పేపర్ ఔట్ లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సూత్రధారి అని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ తీరును వివరించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. మీడియా వేదికగా మాట్లాడటంతోపాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. ఆఖరికి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడమే రెండు పార్టీల లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more:

మొన్న బీఎల్.. నేడు బండి.. కీలక నేతలే బీఆర్ఎస్ టార్గెట్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed