తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. తాజా సర్వేలో ఆ పార్టీ గ్రాఫ్ హైక్

by Disha Web Desk 13 |
తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. తాజా సర్వేలో ఆ పార్టీ గ్రాఫ్ హైక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకునేందుకు అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఇక తెలంగాణలో ప్రధాన పార్టీలు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పోలింగ్ గడువు దగ్గరపడుతున్నకొద్దీ సర్వేల జోరు పెరుగుతోంది. రాష్ట్రస్థాయి సంస్థల నుంచి జాతీయ స్థాయి సర్వే సంస్థల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అనే దానిపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జన్ లోక్ పోల్, న్యూస్ ఎక్స్ సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ సర్వేల ప్రకారం తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతున్నట్టు స్పష్టమవుతోంది.

జన్ లోక్ పోల్ లేటెస్ట్ సర్వే..

జన్ లోక్ పోల్ లేటెస్ట్ సర్వే అంచనాల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగినట్లు తేలింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 9-10 స్థానాల్లో గెలవబోతున్నదని ఈ సర్వే వెల్లడించింది. అధికార కాంగ్రెస్ 7-8 స్థానాలు, ఇతరులు 0-1 స్థానంలో గెలవబోతున్నట్లు అంచనా వేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు సేకరించిన ప్రజాభిప్రాయంలో ఈ విషయం వెల్లడైనట్లు ఈరోజు జన్ లోక్ పోల్ తెలిపింది.

బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్..!

ఆసక్తికరంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ గత నెలతో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 3.99 శాతం పెరిగి మొత్తం 33.22 శాతం ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నది. మార్చిలో బీజేపీ ఓట్ షేర్ 29.23 శాతంగా ఉందని తెలిపింది. కాంగ్రెస్ విషయానికి వస్తే గత మార్చిలో 35.40 శాతం ఓట్ షేర్ ఉండగా 0.61 శాతం పెరిగి 36.01 శాతానికి చేరుకుందని తెలిపింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. మార్చిలో గులాబీ పార్టీకి 26.42 శాతం ఓటు షేర్ ఉండగా ఏప్రిల్‌లో 3.71 శాతం తగ్గి 22.71 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. బీఆర్ఎస్‌కు తగ్గుతున్న ఓట్ షేర్ బీజేపీకి సానుకూలంగా మారుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

న్యూస్ ఎక్స్‌లో హస్తం హవా..

న్యూస్ ఎక్స్ విడుదల చేసిన ఒపీనియన్ పోల్ ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. ఈ సర్వే ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉన్నా బీజేపీ సైతం రేస్‌లో దూసుకువస్తున్నట్లు తెలిపింది. బీఆర్ఎస్ గతంతో పోలిస్తే భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 5, బీఆర్ఎస్‌కు 3 ఎంఐఎంకు 1 స్థానం దక్కబోతున్నదని అంచనా వేసింది.


Next Story

Most Viewed