పోలీసులా..? రౌడీలా..?.. ఓయూలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ‌చార్జ్!

by Ramesh Goud |
పోలీసులా..? రౌడీలా..?.. ఓయూలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ‌చార్జ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రక్త వాతావరణం చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ విద్యార్ధి సంఘం నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గత కొద్ది రోజులుగా డీఎస్సీ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్ధులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నేపధ్యంలోనే బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో డీఎస్సీ అభ్యర్ధులకు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నిరసనను అడ్డుకునేందుకు ఓయూ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

నిరసనలో పాల్గొన్న విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో విద్యార్ధులకు పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. దీంతో విద్యార్ధి సంఘం నాయకులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. ఈ లాఠీ చార్జ్ తో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం నిరసన చేస్తున్న విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేగాక న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారు. జర్నలిస్టులమని చెబుతున్న సరే వినకుండా వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పోలీసులా? రౌడీలా? అని పోలీసులపై మండిపడుతున్నారు.

Next Story

Most Viewed