'పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే'

by Disha Web Desk 2 |
పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిసెంబర్ 12, 13 తేదీల్లో మాదిగ జేఏసీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఆదివారం ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టి తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కేటాయించాలని, ఎస్సీల రిజర్వేషన్ 20 శాతానికి పెంచాలని, గిరిజన యూనివర్సిటీని ప్రకటించాలనే డిమాండ్స్‌తో ఛలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలేటి శ్రీశైలం, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్, ఓయూ బీఎస్ఎఫ్ అధ్యక్షుడు బోరెల్లి సురేష్, టీడీడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగులయ్య, రాష్ట్ర నాయకులు వేల్పకొండ వెంకటేష్, బీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మొగిలిద్ద ప్రసాద్, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జెర్రిపోతుల సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story