BRS ఎమ్మెల్యేలకు మరో కొత్త టెన్షన్.. జనంలోకి వెళ్లాలంటేనే జంకుతోన్న గులాబీ లీడర్స్..!

by Disha Web Desk 19 |
BRS ఎమ్మెల్యేలకు మరో కొత్త టెన్షన్.. జనంలోకి వెళ్లాలంటేనే జంకుతోన్న గులాబీ లీడర్స్..!
X

గతంలో గులాబీ పార్టీ నేతలు మీటింగులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నారంటే.. అక్కడి ఇతర పార్టీ నేతల్లో గుబులు పెరిగేది. ఎలాంటి విమర్శలు చేస్తారో..? వాటికి ఎలా బదులు చెప్పాలో? ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకోవాలో? అనే భయాలు ఉండేవి. కానీ, ఇప్పుడు సీన్​రివర్స్ అయ్యింది. ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఎక్కడ? ఎవరు? ఎలా? నిలదీస్తారో తెలియక సతమతం అవుతున్నారు. చుట్టూ పోలీసులు ఉంటే తప్ప కాలు బయటపెట్టడం లేదు. పార్టీ అధిష్ఠానం మాత్రం షెడ్యూల్​వరకూ ప్రజలకు సర్దిచెప్పాలని చెప్తున్నది. ఎందుకంటే ఆ తర్వాత ఎవరు ఏం అడిగినా.. ఎలక్షన్​కోడ్​ఉన్నదని నెట్టుకురావచ్చని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా గులాబీ నేతలకు నిలదీతల భయం కాస్త గట్టిగానే పట్టుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అభ్యర్థులను కూడా గులాబీ ప్రకటించడంతో ఎన్నికల ప్రచారానికి ఉత్సాహంగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకు కొత్త భయం పట్టుకున్నది. దళిత బంధు, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్లు, బీసీ సాయం సహా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఇస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక మంత్రులు సైతం ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ పెద్దలకు చెప్పి ఆవేదన చెందుతున్నారు.

అయితే ఎన్నికల షెడ్యూలు వచ్చేవరకూ ఏదోరకంగా నెట్టుకురావాలని కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు తెలిసింది. నేతలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పెద్ద సమస్యగా మారింది. నిర్మించిన ఇళ్లు.. వేలల్లో ఉంటే దరఖాస్తులు లక్షల్లో ఉన్నాయి. దీంతో ఇండ్ల కేటాయింపు వారికి పెద్ద సవాలుగా మారింది. అయితే, ఇళ్లు రాని వారికి గృహలక్ష్మి స్కీమ్ మంజూరుచేస్తామని బుజ్జగిస్తున్నా లబ్దిదారులు వినడం లేదు. సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు ఏం సరిపోతాయని, అదికూడా మూడు విడతలుగా ఇవ్వడం ఏంటని విమర్శలు వస్తున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వాపోతున్నారు.

అలాగే దళిత బంధు, బీసీ సాయం పథకాల కింద చెక్కులు ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన చెందారు. ఆసరా పెన్షన్ల అప్లికేషన్లు పెండింగ్ పెట్టారని దీంతో దరఖాస్తుదారులు తమ వెంటపడుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ మాజీ మంత్రి సన్నిహితులతో మొరపెట్టుకున్నారు.

ప్రజల్లో పెరిగిన చైతన్యం..

ప్రజల్లో చైతన్యం పెరిగిందని.. ప్రచారంలో తమకు ఎదురవుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో స్కీమ్స్ పెండింగ్‌లో ఉంటే త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసేవారని.. కానీ, ఇప్పుడు తీవ్ర స్వరంతో నిలదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘డబుల్ బెడ్ రూమ్ మీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు అని ఓ మహిళా నిలదీస్తుండగా.. మరో మహిళ సెల్ ఫోన్‌లో వీడియో రికార్డు చేస్తున్నారు. దీంతో అక్కడ ఎలా స్పందించాలో అర్థం కాలేదు. సీరియస్ అయితే వీడియో వైరల్ చేస్తారు. అందుకే మౌనంగా ఉండాల్సి వచ్చింది’ అని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

షెడ్యూలు వచ్చేవరకు ఓపిక పట్టండి

ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలని పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రతి స్కీమ్‌ను పక్కాగా అమలు చేస్తామని సర్ది చెప్పాలని, ఈలోపు ఎన్నికల షెడ్యూలు వస్తే, స్కీమ్స్ అమలుకు బ్రేకులు పడుతాయని వివరిస్తున్నారు. అయితే షెడ్యూలు వచ్చేలోపు కొందరికి చెక్కుల పంపిణీ చేపట్టాలని, దీంతో మిగతా వారిలో నమ్మకం వస్తుందని సూచిస్తున్నట్టు తెలిసింది.

Next Story

Most Viewed