వ్యభిచార కేంద్రాలుగా ఓయో రూమ్స్?

by Disha Web Desk 9 |
వ్యభిచార కేంద్రాలుగా ఓయో రూమ్స్?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఓయో రూమ్స్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా ఏర్పాటైన వీటిల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏకాంతంగా గడిపేందుకు బెస్ట్ లొకేషన్‌గా మారుతున్నాయి. డ్రగ్స్, సెక్స్ వంటి వాటికి కేంద్రాలౌతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీస్ శాఖ కూడా వీటిపై నిఘా పెంచింది. నగరంలోని ప్రముఖ లాడ్జీలు ఓయోతో ఒప్పందం కుదుర్చుకుని పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఇవి లవర్స్‌తో పాటు ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు హాట్‌స్పాట్‌గా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆన్‌లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకుంటున్న యువత గదులలో మద్యం, మత్తు పదార్ధాలు కూడా విచ్చలవిడిగా సేవిస్తున్నారు. వీటిల్లో గదులు బుక్ చేసుకుని ఐడీ ప్రూఫ్స్ ఇస్తే హోటల్లో రహస్యంగా ఏం చేసినా బయటకు తెలియకుండా పోతుండడంతో ఓయో రూమ్స్ బుకింగ్ కోసం యువత ముందుకు వస్తున్నారు. గదులలో ఇద్దరికి మించి మూడవ వ్యక్తికి అనుతించకపోవడంతో వీటి పట్ల యువతీ, యువకులు ఆకర్షితులౌతున్నారు. కొంతమంది విఠులు ఇతర రాష్ట్రాల నుంచి సెక్స్ వర్కర్లను తెప్పించి వ్యభిచారం జోరుగా సాగిస్తున్న సంఘటనలు కూడా గతంలో పోలీస్ దాడుల సందర్భంగా వెలుగు చూశాయి.

సగానికిపైగా యువత..

ఓయో రూమ్స్‌లో గదులు తీసుకునేందుకు 50 శాతానికి పైగా యువతనే ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. పెళ్లికాని జంటలు గదులు బుక్ చేసుకుంటున్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కేవలం పేమెంట్ పై మాత్రమే దృష్టిసారిస్తూ గదుల కేటాయింపులు అధికంగా జరుపుతున్నారని సమాచారం. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో ఓయో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ రూంలలో మద్యం వినియోగం కూడా అధికంగానే సాగుతోంది.

వ్యభిచార కేంద్రాలుగా..

హైదరాబాద్ మహా నగరంలోని రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఓయో, ఇతర లాడ్జీలు వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా మారుతుండడాన్ని గుర్తించిన పోలీసులు వీటిపై పలుమార్లు దాడులు నిర్వహించి మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. కేసులు మాకేమీ కొత్తకాదన్నట్లు తరచుగా పట్టుబడుతూ ఫెనాల్టీలు కడుతూ అదే దందాను కొనసాగిస్తున్నారు. సీసీ టీవీలు ఏర్పాటు చేయకపోతే తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్, ఐపీసీ 188 ప్రకారం శిక్షార్హులని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. దేశంలో ఎక్కడి నుండైనా ఎక్కడైనా ఆన్‌లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో ఓయో వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.

ధనార్జనే ధ్యేయంగా..

ఆన్‌లైన్ బుకింగ్స్ చేసే హోటళ్లు కొన్ని ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఓయో లాడ్జీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు గదుల కోసం వచ్చే వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు తీసుకోవాలని నగర పోలీసులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయినా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో నగర సీపీ సీవీ ఆనంద్ ఇటీవల ఓయో లాడ్జీల నిర్వహకులకు పలు సూచనలు చేశారు. కేవలం ఓయో నిర్వాహకులే కాకుండా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసే లాడ్జీల నిర్వాహకులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది గుర్తించిన ఆయన త్వరలో వారితో మీటింగ్ ఏర్పాటు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed