నివాస స్థలాలను ఖాళీ చేయాలి.. లేకపోతే కూల్చేస్తాం.. ప్రజలకు నోటీసులు

by Disha Web Desk 3 |
నివాస స్థలాలను ఖాళీ చేయాలి.. లేకపోతే కూల్చేస్తాం.. ప్రజలకు నోటీసులు
X

దిశ వెబ్ డెస్క్: రైతుకు సాయం పేరుతో అందిస్తున్న రైతుబంధు అక్రమార్కుల జేబులోకి చేరుతుంది. ఈ కోవలోకే నకిరేకల్ నియోజకవర్గంలోని ఓ గ్రామం కూడా చేరింది. వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్ నియోజకవర్గం లోని కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో గ్రామస్తులు నివసిస్తున్న ఇళ్ల స్థలాలకు, దేవుని గుడికి, ప్రభుత్వ పాఠశాలకు రైతుబంధు సుమారు గత నాలుగేళ్లుగా అందుతున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 50 ఏళ్ల క్రితం దళితులు కొంతమంది, బీసీలు ఓ వ్యక్తి దగ్గర భూమిని కొనుగోలు చేసి పక్కాఇల్లు నిర్మించుకొని జీవన కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో దళితులు పూజించే దేవాలయాలను, ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు 2,3,5,8,9,597,772, సర్వే నెంబర్లలోని సుమారు 4.31ఎకరాలకు పైగా భూమిని దాదాపు నాలుగేళ్ల క్రితం అక్రమ పట్టా చేసుకున్నారు.

పట్టా చేసుకున్న నాటి నుంచి అక్రమ పట్టాదారులకు ప్రభుత్వం అందించే రైతుబంధు సొమ్ము కూడా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమవుతుంది. తాము నివసించే ఇళ్ల స్థలాలు వేరే వాళ్ళు అక్రమ పట్టా చేసుకొని రైతుబంధు పొందుతున్నారని సమాచారం తెలిసిన గ్రామస్తులు ఈ ఏడాది మొదట్లో జిల్లా కలెక్టర్, ఆర్డీవో, మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అలానే ఈ అక్రమ పట్టాలపై.. ఆ అక్రమ పట్టాలు చేసిన అధికారిపై పూర్తిస్థాయి విచారణ చేసి అక్రమ పట్టాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా చేపట్టారు. అయినా ఇంతవరకు వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకో లేదు. ఇది ఇలా ఉండగా తమ పేరుతో పట్టా ఉన్న భూమిని ఖాళీ చేయాలని లేకపోతే ఇల్లు కూడా కూలగొట్టాల్సి వస్తుందని గ్రామస్తులకు అక్రమ పట్టాదారుడు నోటీసులు పంపించినట్లు సమాచారం.

ఒకవేళ ఆ పటాదారుడు అనంత పని చేస్తే ఊరు ఊరే కూలిపోయే ప్రమాదం ఉంది అందుకే అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed