చెప్పేదేం లేదు.. సీబీఐ అరెస్ట్‌పై స్పందించిన కవిత

by Ramesh N |
చెప్పేదేం లేదు.. సీబీఐ అరెస్ట్‌పై స్పందించిన కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. విచారణ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలక సూత్ర దారి అని సీబీఐ కోర్టులో ఆరోపించింది. ఈ క్రమంలోనే 5 రోజుల కస్టడీకి సీబీఐ అధికారులు కోర్టును కోరారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదన్న కవిత తరపు న్యాయవాది తెలిపారు. కవిత విషయంలో సీబీఐ ఈ నిబంధన పాటించలేదని న్యాయవాది పేర్కొన్నారు.

తీర్పుపై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలక సూత్ర దారి అని సీబీఐ కోర్టులో ఆరోపించింది. ప్రాథమిక హక్కుకు ఆటంకం కలిగించకుండా కవితను అరెస్టు చేశామన్నారు. అరెస్ట్ విషయంలో జైలు అధికారులకు, ఆమె భర్తకు చెప్పామని సీబీఐ అధికారులు తెలిపారు. లిక్కర్ స్కాం తొలిసారిగా అరెస్ట్ చేసిన ‘ఓన్లీ మచ్ లౌడర్’ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌తో పాటు పలువురితో కలిసి కవిత స్కెచ్ వేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, హైదరాబాద్‌లో మీటింగ్‌లు జరిగాయని, కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతోందని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణంలో రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు కవిత అందించారని పేర్కొంది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ. 25 కోట్లు అందజేశారని సీబీఐ తెలిపింది. వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలను దృవీకరిస్తున్నాయని, వాట్సాప్ చాట్‌ను కోర్టుకు అందజేశామని తెలిపారు. కాగా, సీబీఐకి కస్టడీ ఇచ్చే విషయంపై మధ్యాహ్నం 2 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలిసింది.

సీబీఐ అరెస్ట్‌పై స్పందించిన కవిత

సీబీఐ అరెస్ట్ పై కవిత స్పందించారు. సీబీఐ చేస్తున్నది తప్పు అని చెప్పారు. సీబీఐ అరెస్ట్ అక్రమమని తేల్చిచెప్పారు. సీబీఐకి చెప్పడానికి ఏమీ లేదు. అడిగిన ప్రశ్నలనే సీబీఐ అడుగుతున్నదన్నారు.Next Story