8న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర

by Disha Web Desk 20 |
8న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జరుగనుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆమె పాదయాత్ర జరుగడం తొలిసారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు వైఎస్ షర్మిల రెండుసార్లు పర్యటించారు. బిచ్కుంద మండలం షెట్ పల్లిలో మంజిరా నదిలో నీటమునిగిన కుటుంబాలను గతేడాది పరామర్శించారు. ఈ యేడాది నిరుద్యోగ దీక్షలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక రోజు నిరాహార దీక్షను నిర్వహించారు.

వైఎస్సాఆర్ పాలన ఫలాలను ప్రజలకు ఏ విధంగా అందాయో గుర్తు చేస్తూ ఆయన ఉమ్మడి జిల్లాలో చేసిన డెవలప్ మెంట్ ను గుర్తు చేస్తూ పాదయాత్ర జరుగనుంది. గతేడాది అక్టోబర్ 22న ప్రారంభమైన పాదయాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 8న కాలు పెట్టనుంది. కామారెడ్డి ఇంచార్జి నీలం రమేష్ ఆధ్వర్యంలో పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటి వరకు 2400 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో అదే రోజు బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు వైఎస్ పాలనలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన డెవలప్ మెంట్ పనులను గుర్తు చేస్తూ రాజన్న రాజ్యం కొరకు వైఎస్ షర్మిల పాదయాత్రను చేపట్టనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల మీదుగా జగిత్యాల జిల్లాకు సాగనుంది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలను కలుపుతూ రూట్ మ్యాప్ ను తయారు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు 200 మంది పాదయాత్రలో పాల్గొనున్నారు. అందుకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగినట్లు కామారెడ్డి ఇంచార్జి నీలం రమేష్ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా 100కిలో మీటర్లకు ఒక వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 43 విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వై.ఎస్. పాలన ప్రజల్లో బలంగా నాటుకుందని ఆయనకు నిజామాబాద్ జిల్లాలో అభిమానులకు కొదవలేదన్నది వైఎస్ఆర్ సీపీ నాయకుల విశ్వాసం. వైఎస్ హయంలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ కాలువల ఆదునీకరణకు రూ.500 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకే వైఎస్ హయంలో ప్రాణహిత చేవెళ్ల పథకంలోని ప్యాకేజి 21, 22 పనులను చేపట్టారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంతో పాటు నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వైఎస్ హయంలోనే జరిగిందని చెబుతున్నారు. దాంతో పాటే ఆలీసాగర్, గుత్ప, హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలు ఆయన హయంలో జరిగినవి కావడంతో ప్రజల్లో వైఎస్ కు ఎనలేని అభిమానం ఉందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనూ వందలకిలో మీటర్ల పాదయాత్ర దోహదం చేస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కార్యవర్గాలను ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారీగా బాధ్యులను నియమించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నానికి వైఎస్ షర్మిల పాదయాత్ర తోడ్పడుతుందని నమ్ముతున్నారు.

Next Story

Most Viewed