మోడీని ప్రధానిగా గుర్తించం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Web Desk |
మోడీని ప్రధానిగా గుర్తించం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ సాగిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ బుధవారం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి నాయకత్వంలో బైక్ ర్యాలీ చేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను రోల్ మోడల్‌గా వర్ణించిన నోటితోటే ఇంతటి విషం గక్కుతున్నావా? అంటూ మోడీ వ్యాఖ్యలపై మండి పడ్డారు. ''60 ఏండ్లుగా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అపహస్యం చేస్తావా?, వేరుపడి బాగుపడ్డాం'' అని జీవన్ రెడ్డి అన్నారు. ఎన్‌డీఏ అంటేనే 'నేషనల్ డిస్రక్టీవ్ అలయన్స్‌'గా తయారైందన్నారు. కేసీఆర్ తెలంగాణను కళ్ళు చెదిరే రాష్ట్రంలా మార్చారని, నోట్ల రద్దు చేసినంత సులభం కాదు వచ్చిన తెలంగాణను రద్దు చేయడం అన్నారు. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నువ్వు గుర్తించకపోతే, నిన్ను ప్రధానిగా మేం గుర్తించం' అని అన్నారు. తెలంగాణ జోలికొస్తే బీజేపీని నెలకేసి కొడతామని, తెలంగాణ ఎవడబ్బ సొమ్ము కాదని, గతంలో రాష్ట్రంగా ఉన్న తెలంగాణను తిరిగి రాష్ట్రంగా ఇచ్చారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు.

ప్రధాని మోడీ ముందు చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. మోడీది నోరు కాదని, మోరీ అని ఎద్దేవా చేశారు. ''గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే మోడీ ఉన్న రాష్ట్రాలను తగ్గిస్తున్నారు. తెలంగాణను కూడా మోడీ కశ్మీర్‌లా మార్చే కుట్ర చేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతోంది'' అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2013లో కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతనే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణకు మద్దతు ప్రకటించిందని, 2014లో తెలంగాణ ఏర్పడకపోయి ఉంటే నరేంద్రమోడీ తెలంగాణ ఇచ్చేవాడే కాదని ఎందుకంటే రాష్ట్రాల విభజనకు మోడీ వ్యతిరేకం అన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదన్నారు. స్వయంగా ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయం ఇంకా రూపుదాల్చలేదని తెలిపారు. బయ్యారంలో స్టీలు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గంగలో కలిపారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న బీజేపీని ఈ గడ్డమీద నుంచి తరిమి కొడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.



Next Story

Most Viewed