బిల్లులు రావడంలేదని.. అధికార పార్టీ సర్పంచ్‌లు నేలపై కూర్చుని నిరసన

by Disha Web Desk 6 |
బిల్లులు రావడంలేదని.. అధికార పార్టీ సర్పంచ్‌లు నేలపై కూర్చుని  నిరసన
X

దిశ, కామారెడ్డి రూరల్ : అధికార పార్టీకి చెందిన సర్పంచులు బిల్లులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల సభలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కామారెడ్డి మండలంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే 15 వ ఫైనాన్స్, ఎస్ ఎస్ సి తదితర నిధులు పంచాయతీ ఖాతాల్లో జమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పంచాయతీ అవసరాలకు కేటాయించకుండా కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ కిస్తీలు అంటూ నిధులను మళ్లిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు అవుతున్నాయనీ, పారిశుద్ధ్య పనులు చేయడానికి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం, పనులు నిర్వహించడానికి రావడం లేదన్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించక పోవడంతో ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆరోపించారు.

ఒక్కరు తప్ప మండలంలోని అందరు సర్పంచులు అధికార పార్టీకి చెందిన వారే కావడం, వారే స్వయంగా తమ ఇబ్బందులను సభలో నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి చేస్తామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు.

అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్‌ల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దీంతో సర్పంచ్‌లు శాంతించి మండల సభను సజావుగా జరిగేలా సహకరించారు. అనంతరం సభలో శాఖల వారీగా ఏజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ నరేష్, ఎంపీడీవో శంకర్ నాయక్‌తో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed