శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రం నెంబర్ వన్ : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

by Disha Web Desk 1 |
శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రం నెంబర్ వన్ : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
X

దిశ, నిజామాబాద్ క్రైం : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు డీసీపీ మధుసూదన్ రావు పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, మెరుగైన పోలీసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు సమకూర్చిన పెట్రో కార్స్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో పోలీస్ సిబ్బంది నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఇతర అతిథులు జెండా ఊపి హెడ్ క్వార్టర్స్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఎన్టీఆర్ చౌరస్తా, కలెక్టరేట్ గ్రౌండ్, ఓల్డ్ ఎల్ఐసీ చౌరస్తా, ఫులాంగ్ చౌరస్తా, రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా, వర్ని రోడ్డు చౌరస్తా, ఖిల్లా రోడ్, బోధన్ బస్టాండ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, న్యూ బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా ర్యాలీ తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంది.

పోలీస్ వ్యవస్థ పని తీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, ఆయుధాల గురించి సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు పకడ్బందీగా ఉండాలన్నారు. అప్పుడే పర్యాటకంగా, పారిశ్రామికంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుంటుందన్నారు. నిత్యం 24 గంటల పాటు విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు.

జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభం సమయంలోను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని అభినందించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed