గాడిద గుడ్డు పెట్టదు.. రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఇవ్వడు: ఎంపీ అర్వింద్

by Disha Web Desk 12 |
గాడిద గుడ్డు పెట్టదు.. రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఇవ్వడు: ఎంపీ అర్వింద్
X

దిశ, బోధన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నాడని, అసలు గాడిద గుడ్డు పెట్టదని అలాగే రేవంత్ రెడ్డి సర్కారు ఆరు గ్యారెంటీలు ఇవ్వదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం జన్నేపల్లిలో, రెంజల్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. కలియుగ శ్రీ రాముడు నరేంద్ర మోడీ 500 సంవత్సరాల తర్వాత త్రేతాయుగపు రాముడిని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నిర్వహించాడని తెలిపారు. కరోనా సమయంలో 140 కోట్ల భారతీయులకు 2 దోసుల వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా 145 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేశారని కొనియాడారు.

మోదీ నాయకత్వంలో భారత్ విశ్వ గురువు గా మారిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా పేదవారికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడని, మహిళ సంఘాల మహిళలకు వేల కోట్ల ఋణాలు, 5%వడ్డీ రాయితీ మోదీ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 10 పైసల వడ్డీ కే ఋణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళకు ఉజ్వల పథకం లో భాగంగా ఉచిత గ్యాస్ సిలెండర్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఉచిత వైద్య సేవలు, రైతులకు ఎకరాల 18 వేల రసాయన ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాడని తెలిపారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

కల్యాణ లక్ష్మీ లో తులం బంగారం, 4వేల ఫించన్, 500 ల బోనస్, రైతుబంధు లాంటి హామీలు అమలు చేయలేదని విమర్శించారు. 2 లక్షల రుణం మాఫీ చేస్తానని దేవుళ్ళ మీద ఒట్టు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సొంత పొరగాళ్ల మీద వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల అమలు అసాధ్యమన్నారు. మోదీ దేశ ఆర్థిక ప్రగతి ని పరుగెత్తించాడని, ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశం ను 5 వ స్థానానికి తీసుకొచ్చాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మన ఆస్తులు దోచి ముస్లిం లకు పంచుతదని అన్నారు. మోడీ ప్రభుత్వం అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ ముస్లిం మహిళలను ఆగం పట్టిస్తుందని అన్నారు.

తాను గతంలో మాట ఇచ్చినట్లు పసుపు బోర్డు ఏర్పాటు చేశానని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనటువంటి పసుపు ధర నేడు రూ. 22 వేలు పలుకుతోందని అన్నారు. దేశంలో రామరాజ్యం కొరకు బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మెడపాటి ప్రకాష్ రెడ్డి,రెంజల్ జడ్పీటీసీ మ్యాక విజయ సంతోష్, ఎంపీపీ రజని కిషోర్, వైస్ ఎంపీపీ యోగేష్, నవీపేట్ ఎంపీటీసీ రాధ, మ్యాక సంతోష్,పిల్లి శ్రీకాంత్, సరిన్, రాజశేఖర్, రాజేందర్, ఆనంద్, భూషణ్, శ్రీనివాస్ గౌడ్, రచ్చ సుదర్శన్, నాయకులు, కార్యకర్తలు,వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed