రికార్డు స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

by Disha Web Desk 15 |
రికార్డు స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యాసంగి సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ప్రభుత్వపరంగా నెలకొల్పిన కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికే 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు, ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం అయ్యారు. అనంతరం గుండారం గ్రామంలోని జై గణేష్ ప్యాడి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ (రైస్ మిల్)ను సందర్శించి, ధాన్యం మర పడుతున్న తీరును, స్టాక్ నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇందల్వాయి మండలంలోని గన్నారం, చంద్రయాన్ పల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించి, మాయిశ్చర్ యంత్రం ద్వారా తానే స్వయంగా తేమ శాతాన్ని కొలిచారు. 17 శాతానికి లోబడి తేమ శాతం ఉండేలా చూసుకోవాలని, ఈ మేరకు ఎఫ్ఏ క్యూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తెచ్చేలా వారికి అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ అధికారులకు సూచించారు. కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు అనే వివరాలను ఆరా తీశారు. ఈ కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులు పల్లా సందీప్, మల్లయ్య, చెవుల పెద్ద సాయిలును సెల్ ఫోన్ ద్వారా సంప్రదించి, బిల్లుల చెల్లింపులు జరిగాయా?...కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా?...సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది?... తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు తమ బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయని, కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని,

సకాలంలో ధాన్యం తూకం జరిగిందని రైతులు తెలుపగా ప్రిన్సిపల్ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బందిపడకూడదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని అన్నారు. జిల్లా పర్యటనకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రెటరీ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపులు, సీఎంఆర్ కేటాయింపులు తదితర వాటిపై ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఇదివరకటితో పోలిస్తే రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లింగ్ తదితర అంశాలలో ప్రస్తుతం పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని, స్పష్టమైన ప్రగతి కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఆశించిన రీతిలో సహాయ, సహకారాలు లభిస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు. అయితే సీఎంఆర్ కేటాయింపులు లక్ష్యానికి అనుగుణంగా సకాలంలో జరిగేలా ధాన్యం మిల్లింగ్ చేయాలని మిల్లర్లకు సూచించారు. ముఖ్యంగా పార్​బాయిల్డ్ బియ్యం నిల్వల అవసరం ఎక్కువగా ఉన్నందున ఏమాత్రం విరామం లేకుండా మిల్లింగ్ జరిపించాలని అన్నారు. తెలంగాణతో పాటు కేరళ,

పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సైతం మన రాష్ట్రం నుండే బియ్యం ఎగుమతి జరుగుతున్నందున నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మిల్లింగ్ విషయంలో నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్లకు మంచి పేరు ఉందని, దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ కోసం జిల్లాలో 480 కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తెచ్చారు. నిజానికి 466 కేంద్రాలను ఏర్పాటు చేసి, 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా రైతుల అవసరాలను గుర్తిస్తూ మొత్తం 480 కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఇప్పటికే 373 కేంద్రాలలో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని, లక్షా 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి

రూ. 98 కోట్ల బిల్లులను రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేదని, 90 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, కొత్త గన్నీ బ్యాగులు కూడా జిల్లాకు సరఫరా అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. సీ.ఎం.ఆర్ లక్ష్య సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, డీ ఎస్ ఓ చంద్ర ప్రకాష్, సివిల్ సప్లైస్ డీఎం జగదీశ్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు చేరుకున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ చౌహాన్ కు ఆర్అండ్ బీ అతిథి గృహం వద్ద జిల్లా అధికారులు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.


Next Story

Most Viewed