మోడీ ఓటమి భయంతోనే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
మోడీ ఓటమి భయంతోనే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : భారత రాజ్యాంగంపై విశ్వాసం లేకనే ప్రధాని మోడీకి ఎన్నికల్లో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతుందని, అందుకే ప్రజల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని రాజస్థాన్ లో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లీంలకు పంచిపెడుతారని అనడం అందుకు ఉదాహరణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అవిభాజ్య ఆస్తులను పంచుకోవాలంటేనే సవాలక్ష నిబంధనలున్నాయని కానీ మోడీ కేవలం ఓట్ల రాజకీయం కోసం ప్రజల మధ్య, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

రాముడు అందరి వాడని తాను కూడా అందరి దేవుళ్లను పూజిస్తానని అందరి మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తానని దానిని భారత రాజ్యాంగం సెక్యూలర్ దేశంగా ప్రకటించిన విషయాన్ని ఉదహరించారు. దేవుడు గుడిలో ఉండాలి . . . భక్తి గుండెల్లో ఉండాలి కానీ దేశంలో వ్యాపారం రాజకీయం అయిందని అందుకు మోడీ ప్రభుత్వమే కారణమని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 7దేశాల్లో హర్యానా, పంజాబ్ రైతులు శక్తి వంతమైన రైతులని, వారు మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్లా చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమించారని నిజామాబాద్ రైతులు వారికేమి తీసిపోరని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో వంద రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని, పసుపు బోర్డు ఏర్పాటు చేపిస్తానని హామీ ఇచ్చి ఎంపీ అయిన కవితను అవేవి సాధించకపోవడంతో ఓడించిన ఘనత పసుపు రైతులదన్నారు.

2019లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అరవింద్ తాను గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటికి పసుపు బోర్డు తెలేదని ప్రధాని మోదీ హామీ ఇచ్చిన జీవోల మాత్రం పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో స్పష్టం చేయలేదన్నారు. నిజామాబాద్ రైతులతో పెట్టుకుంటే ఎవరికైనా రాజకీయ సమాధి అని అన్నారు. పసుపు బోర్డు తేకుండా స్పేస్ ఎక్స్ టెన్షన్ సెంటర్ ను పసుపు బోర్డుగా చెబుతున్న నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కు రైతులు ఏ విధంగా బుద్ధి చెబుతారో తాను చెప్పనక్కర లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరిన తర్వాత ఆర్మూర్ లో పసుపు బోర్డు కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకే కాంగ్రెస్ అధిష్ఠానం తనను గుర్తించిందని అన్నారు. నిజామాబాద్ ప్రజల, రైతుల ఆశీస్సులతోనే తాను పీసీసీ అధ్యక్షుడిగా, తర్వాత ముఖ్యమంత్రి అయ్యానన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన మాట ప్రకారమే నిజామాబాద్ జిల్లాలోని ఆసియాలోనే అతి పెద్దదయిన బోధన్ చక్కర కర్మాగారాన్ని తెరిపిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి సభా సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. అందులో సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17 లోపు చక్కెర కర్మాగారాన్ని తెరిస్తామన్నారు. రైతుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ పథకంను అమలు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా చేయలేకపోయామని దానిని ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామన్నారు. ఒక్కోసారి ఓటములే గెలుపునకు నాంది అవుతాయని అందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

2018 జూన్ లో కేసీఆర్ ప్రభుత్వం తనను తీవ్ర నిర్బంధం మధ్య అరెస్టు చేసి జైలుకు పంపితే న్యాయస్థానం ద్వారా పోరాడి బయటకు వచ్చిన తర్వాతనే పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి కాగలిగానని చెప్పుకొచ్చారు. తనను కేసీఆర్ కోడంగల్ లో ఎమ్మెల్యేగా ఓటమి పాలు చేస్తే 36 లక్షల ఓటర్లు ఉన్న మల్కాజ్ గిరి ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కారణంగా ఎంపీ అయ్యానని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పదవి త్యాగాలు చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. రైతు నాయకుడే జీవన్ రెడ్డి కాబట్టి తాను అసెంబ్లీలో ఓటమి తర్వాత రైతుల కోసమే పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని అన్నారు.

జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రిగా చేసే బాధ్యత తనదని, కేంద్రంలో ఇండియా ప్రభుత్వం ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు. కేంద్రమంత్రిగా జీవన్ రెడ్డి పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు చక్కర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటారని అన్నారు. జీవన్ రెడ్డికి వేసే ప్రతి ఓటు అభిమానంతో తనకు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ రైతాంగ సంక్షేమం బాధ్యతలు తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సభలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.



Next Story

Most Viewed