ఉత్తుత్తి ఆదేశాలేనా..?

by Disha Web Desk 12 |
ఉత్తుత్తి ఆదేశాలేనా..?
X

ఉమ్మడి జిల్లాలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు రాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు జరిగినా సంబంధిత సొసైటీలకు కేటాయించిన లారీల ధాన్యం ఇప్పటికీ లోడింగ్ లోనే ఉండగా అవి రైస్ మిల్లుల వద్ద అన్ లోడింగ్ కోసం బారులు తీరాయి. లోడ్‌లతో వెళ్లిన లారీలు మిల్లర్ల వద్ద అన్ లోడింగ్ సమయంలో తరుగు, తడిసిన ధాన్యం పేచిలు రావడంతో అక్కడ అన్ లోడింగ్ కావడం లేదు. రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు కేటాయించిన లారీలు ఉమ్మడి జిల్లాలో ఎటూ సరిపోవడం లేదు. దీంతో ఉన్న ధాన్యాన్ని లోడ్‌లో వేసుకున్న లారీలు వాటి అన్ లోడింగ్ అయ్యే వరకు కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా జరిగినా ధాన్యాన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నారు. జీరో పర్మిషన్ ఉన్న ఇసుకను తరలించేందుకు బారులు తీరడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరుగాలం పండించిన ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత ఉండగా అదే సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ రాకపోయినా అక్రమంగా తరలిస్తున్న ఇసుక కోసం వందలాది లారీలు, ట్రాక్టర్లు తిరుగుతుండడంపై ఆరోపణలు వస్తున్నాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం అన్ లోడింగ్‌లో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, పురోగతిపై అధికారులు సమీక్షించిన సమయం లో ఉమ్మడి జిల్లాలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 218 రైసుమిల్లులకు సీఎంఆర్ ను కేటాయించారు. గతేడాది 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా ఈసారి 7 లక్షల పైచిలుకు ధాన్యం లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు.

ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 800 లారీలను ధాన్యం సేకరణలో వినియోగిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలోని 8 రైస్ మిల్లులలో ధాన్యం అన్ లోడ్ కాకపోవడంతో వేల టన్నుల లోడ్‌లతో లారీలు అక్కడ బారులు తీరాయి. ఈ విషయాన్ని ఆర్డీవోలు స్వయంగా సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రి సమీక్ష జరిపి ఐదు రోజులు గడిచినా అన్ లోడింగ్ ప్రక్రియ మందగించింది. దీంతో రైతులు ఎక్కడ అకాల వర్షాలు పడుతాయోనని లారీల కోసం ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్, మే మాసంలో ఉమ్మడి జిల్లాలో చెడగొట్టు వానలు దంచికొట్టాయి. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండు లక్షల క్వింటాలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాలు రోడ్లపైనే తడిసిపోయింది. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యం కారణంగా మొలకలు రావడం తో ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ససేమిరా అన్నారు. ఈ నెల 7న తడిసిన ధాన్యాన్ని తీసుకోమంటూ సీఎంఆర్ అన్ లోడింగ్ ను కూడా మిల్లర్లు నిలిపివేశారు. చివరకు జిల్లా కలెక్టర్ మిల్లర్లతో చర్చలు జరిపి తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా బాయిల్డ్ మిల్లర్లకు అప్పగిస్తామని, అందులో నూక శాతాన్ని నిర్ణయిస్తామనడంతో మిల్లర్లు ఒప్పుకున్నారు. సీఎంఆర్ సేకరణ ప్రారంభమైంది. కానీ అధికారులు అంచనా వేసిన దాని కంటే ఎక్కువగా దాన్యం సేకరణ జరుగాల్సి ఉండగా ప్రధానంగా తడిసిన ధాన్యం ఇబ్బందికరంగా మారింది.

మిల్లర్లు ధాన్యంను తీసుకునేందుకు పెడుతున్న కొర్రీలు ఆలస్యమౌతుండగా రోజుల తరబడి రైసుమిల్లుల వద్ద, గోదాముల వద్ద లారీలు బారులు తీరుతున్నాయి. అకాల వర్షం సమయంలో యుద్దప్రాతిపదికన ధాన్యంను తరలిస్తామని చెప్పిన యంత్రాంగం వర్షాలు లేకపోవడంతో లైటుగా తీసుకున్నట్లు సమాచారం. దానితో ధాన్యాన్ని తరలించేందుకు లారీలు దొరక్క ఇబ్బందులు పడుతుండగా నిజామాబాద్ జిల్లాలో బోధన్, కోటగిరి, రెంజల్ మండలాల్లో మంజీరాలో, కామారెడ్డి జిల్లా బీర్కూర్, బిచ్కుందలో ఇసుకను అక్రమంగా తరలించేందుకు వందల లారీలు ఉన్న రెవెన్యూ, రవాణా శాఖ పోలీసు యంత్రాంగాలు చూసిచూడనట్లు ఉంటున్నాయని ఎల్లారెడ్డి తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇంచార్జి నిజ్జనం రమేష్ ఆరోపించారు. ముందుగా ధాన్యాన్ని తరలించేందుకు అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని దానికొరకు ఇసుక క్వారీల్లో అక్రమంగా ఉన్న లారీలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.

Next Story