కేసీఆర్ చాప్టర్ క్లోజ్

by Disha Web Desk 15 |
కేసీఆర్ చాప్టర్ క్లోజ్
X

దిశ, భిక్కనూరు : రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అయ్యిందని, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కూతురు కవిత తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతుందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత తండ్రి కేసీఆర్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపించడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్​లో జరిగిన మండల పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారందరికీ కండువాలు మెడలో వేసి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా గడవకముందే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పెళ్లి అయిన కొత్త జంటకు ఏడాది తరువాత పిల్లలు పుడతారని, అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా గడవక ముందు నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ గగ్గోలు పెట్టడం సిగ్గుచేటన్నారు. మీలాగా దళితున్ని సీఎం చేస్తామని,రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని,

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని దోకాబాజ్ మాటలు చెప్పలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని, ఎన్నికల తరువాత ఆగస్టు 15 లోపు అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, ఈ విషయమై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయిస్తామని, ఈ విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు.

దండలు, సన్మానాలు వద్దు... మెజార్టీ రావాలి....

దండలు, సన్మానం చేయడం తనకు వద్దని... జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకువచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చిన గ్రామాలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున, జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కార్ ను గెలిపించాలని, తద్వారా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానన్నారు. రెండుసార్లు బీబీ పాటిల్ కు ఎంపీగా అవకాశం కల్పించారని, ఏనాడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడా..? అంటూ మండిపడ్డారు.

వికలాంగుల బస్ పాసుల కోసం సీఎంతో మాట్లాడతా....

వికలాంగులకు ఉచిత ప్రయాణం కోసం అవసరమయ్యే ఆర్టీసీ బస్ పాసుల కోసం సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడతానన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపారి భీం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు లింగాల కిష్టా గౌడ్, గోండ్ల సిద్దరాములు, భిక్కనూరు సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, ఎంపీటీసీ సభ్యులు ఉప్పల బాబు, మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు మాడుగుల నర్సింలు యాదవ్, గుడిసె రాములు, మద్దూరి రవి, మద్ది సూర్యకాంతం, గొల్లపల్లి వినోద్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed