భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది..

by Disha Web Desk 20 |
భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం జరిగిన "ఇండియాస్' జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చునిటీస్ అండ్ చాలెంజెస్ ఫర్ ఇండియా యాస్ ది గ్లోబల్ లీడర్" అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రగవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. వేద పండితులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో గవర్నర్ కు స్వాగతం చేశారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గవర్నర్ కు గౌరవ పూర్వకంగా స్వాగతం పలికారు. 7 వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్జ్వలనం చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతదేశం జీ 20 అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దృష్ట్యా, అత్యంత శక్తివంతమైన దేశాల నేతృత్వంలో వహిస్తున్న డీ గ్రూప్ ఆఫ్ నేషన్స్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ), న్యూఢిల్లీ, దేశంలోని విశ్వవిద్యాలయాలు, అన్ని ఉన్నత విద్యాసంస్థలను జీ 20 కింద విభిన్నకార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఇది వరకు భారతదేశం ప్రపంచదేశాల నుంచి అన్నివస్తువులను ఎగుమతి చేసుకొనేదన్నారు. కాని ఇప్పుడు భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని తెలిపారు. 85% అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలు మనదేశ సహకారం కోసం ఎదురుచూస్తున్నాయని రాష్ర్టగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

భారతదేశం అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశమని అన్నారు. స్వయం శక్తితో ఎదుగుతున్న దేశమన్నారు. 20 దేశాలకు ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో భారతీయులమైన మనం అపారమైన గర్వం పొందుతున్నామని అన్నారు. తనకలను సాకారం చేసుకొనే దిశగా పయనించిందన్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని వాక్సినేషన్ ను తయారుచేసి దాదాపు 150 దేశాలకు సరఫరా చేసిన ఘనత మనదేశానికి ఉందన్నారు. ఇదేగాక రుబెల్లా, పోలియో వ్యాధులకు వాక్సిన్ తయారు చేసి అతిప్రాణాంతమైన వ్యాధులకు చికిత్సను అందిస్తుందన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు వంటి అనేనినాదంతో భారతదేశం సర్వస్వతంత్ర దేశంగా ఎదుగుతుందని అన్నారు.

పెద్దవాళ్లను గౌరవించడం, వర్తమాన కాలంలో పరిస్థితులకు అనుగుణంగా అవసరాలను తీర్చడం, భవిష్యత్ తరాలకు బంగారు బాటను అందించడం కోసం ప్రయత్నం చేయడం భారతదేశం మీద ఉన్న ఒక బాధ్యత అని ఆమె అన్నారు. భారతదేశ చరిత్ర అజరామరం అయ్యిందన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ దేశాలకు శాంతి, అహింస మార్గాలను చూపిందన్నారు. భారతీయ ధార్మిక, ఆధ్యాత్మిక, తాత్త్విక, భక్తి సాక్షాత్కారం యోగావల్ల కలుగుతుందన్నారు. భారతదేశం చూపిన యోగా ధ్యాన విద్య అంతర్జాతీయ పరంగా మంచి మార్గాన్ని నిర్దేశించిందన్నారు. ఈ 2023 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని "ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిల్లెట్స్" అనే సంక్షిప్త సందేశంతో ముందుకు వెళ్తుందని అన్నారు. సంపూర్ణ చిరుధాన్యాల ఆహారం మనభారతీయుల సంస్కృతి అని ఇలాంటివి అలవాటు చేసుకోవాలని అన్నారు.

భవిష్యత్తు తరాలకు పరిసరాల పరిశుభ్రతతో పాటుగా, పచ్చదనం అలవాటు చేసుకొనే విధంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు వ్యక్తిగత స్వయంసమృద్ధిని సాధించే దిశగా పయనించాలని అన్నారు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఎదగడానికి ఉన్న చాలెంజెస్ ఏమిటో వివరించారు. ప్రపంచ దేశాలలో సంక్షోభాన్ని ఎదుర్కంటున్న ఉక్రేయిన్, సిరియా దేశాలకు స్నేహ వారధి అందించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, ఎబీఆర్ఎస్ ఎం జాతీయ సంయుక్త కార్యనిర్వహణా కార్యదర్శి శ్రీ గుంత లక్ష్మణ్ జీ, రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని, ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్. ఆరతి, వీసీ సతీమణి సౌభాగ్యలక్ష్మి, సదస్సు డైరెక్టర్ డా. సత్యనారాయణ పాల్గొన్నారు.

Next Story

Most Viewed